
జనం న్యూస్ సెప్టెంబర్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ - శ్రావణ మాస పర్వదినాన్ని పురస్కరించుకుని ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం కుండలేశ్వరం గ్రామంలోని పురాతన పార్వతీ కుండలేశ్వర స్వామి దేవస్థానంలో అర్చక కుటుంబీకుల యాజమాన్యంలో మహాన్యాస పూర్వక ఏకాదశ వార శ్రీ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, హోమ కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి ఆలయ ప్రాంగణం వేద మంత్రాలతో, శివ నామస్మరణతో మార్మోగింది. స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకారాలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ దేవస్థాన అర్చకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా తమ సంతతి అభివృద్ధిని కాంక్షిస్తూ స్వామి వారికి లక్ష బిల్వార్చన పూజను నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు చేశారు. శివ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయానికి వచ్చిన భక్తులందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని అర్చకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.