
జనం న్యూస్ మే 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల శివారులోని ట్రాన్స్ఫార్మర్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆయిల్ ఫామ్ తోట పూర్తిగా దగ్ధమై రూ.20 లక్షలకు పైగా నష్టం జరిగిందని రైతు పున్నం రాజేందర్ రెడ్డి శాయంపేట మండల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం మండల శివారులోని తనకు, తన భార్యకు చెందిన సుమారు 6 ఎకరాల 10 గుంటల భూమిలో సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ తోటలోకి గురువారం మధ్యాహ్నం మంటలు వ్యాపించాయి. సమీపంలోని విద్యుత్ శాఖ ట్రాన్స్ఫార్మర్లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు ఎగిసి పొలాల్లో ఉన్న ఎండిన పంట అవశేషాలకు అంటుకుని వ్యాపించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఏడాది క్రితం నాటిన ఆయిల్ ఫామ్ మొక్కలు, డ్రిప్ పైపులు, బోరు పైపులు పూర్తిగా కాలిపోయాయని, దీంతో భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందన్నారు. అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చినా సకాలంలో స్పందించలేదని ఆరోపించారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పేర్కొంటూ సంబంధిత అధికారులపై కేసు నమోదు చేసి నష్టపరిహారం అందించడంతో పాటు రైతులను ఆదుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు..