

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం జూలై, 31. 07. 2026 సంగారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖజాయింట్ డైరెక్టర్ డాక్టర్ వసంతకుమారి ఆధ్వర్యంలో జహీరాబాద్ కాన్స్టిట్యూయెన్సీ స్థాయి పశుసంవర్ధక శాఖ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ అధికారులు, పశువైద్యులు పాల్గొని శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాల పురోగతిపై చర్చించారు.సమావేశంలో పశువుల్లో కృత్రిమ గర్భధారణ జాతీయ పథకం అమలును మరింత వేగవంతం చేయాలని, రైతులకు మెరుగైన సేవలు అందించాలని జాయింట్ డైరెక్టర్ సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అవసరమైన టీకాలు, వైద్య సేవలు సకాలంలో అందించాలని అధికారులను ఆదేశించారు.
కరువు నివారణ చర్యల్లో భాగంగా పశువులకు పచ్చిమేత, పొడి మేత కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. గడ్డి విత్తనాల సరఫరాను సమర్థవంతంగా నిర్వహించి రైతులకు అందుబాటులో ఉంచాలని, పశుగ్రాస అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని పేర్కొన్నారు.అలాగే రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పశువుల సంరక్షణ, వ్యాధి నివారణ చర్యలపై అవగాహన కల్పించాలని, ప్రతి పశువైద్యాధికారి తమ పరిధిలో తగిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ వసంతకుమారి ఆదేశించారు. అనంతరం శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాల పురోగతిపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు