
గోల్కొండ రిసార్ట్‌లో సైబరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో సరిహద్దు నేరాల సమన్వయ సమావేశం
జనం న్యూస్ జూలై 20 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి సరిహద్దు ప్రాంతాల్లో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసు శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో గోల్కొండ రిసార్ట్‌లో బోర్డర్ క్రైమ్ కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు.ఈ సమావేశానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్ అధ్యక్షత వహించగా, హైదరాబాద్, ఫ్యూచర్ సిటీ, సంగారెడ్డి, మెదక్, తదితర సరిహద్దు కమిషనరేట్లు, జిల్లాల పోలీసు అధికారులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్ మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతాల్లో జరిగే నేరాలను అరికట్టడంలో పోలీసు శాఖల మధ్య సమన్వయం, వేగవంతమైన సమాచార మార్పిడి, సంయుక్త కార్యాచరణ అత్యంత కీలకమని అన్నారు. ఒక కమిషనరేట్ లేదా జిల్లా పరిధిలో నేరానికి పాల్పడి మరో ప్రాంతానికి పారిపోయే నేరస్థులను గుర్తించి, త్వరితగతిన పట్టుకోవడానికి పరస్పర సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ నెట్వర్క్, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సమర్థవంతంగా వినియోగించి నేరాల నియంత్రణలో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. అలాగే రౌడీ షీటర్లు, చరిత్ర కలిగిన నేరస్తులు, అంతర్రాష్ట్ర ముఠాలు, సైబర్ నేరస్థులపై నిరంతర నిఘా కొనసాగించాలని, ప్రతి సరిహద్దు పోలీసు యూనిట్ పరస్పరం సమాచారాన్ని వెంటనే పంచుకుంటూ సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.సమావేశంలో లా అండ్ ఆర్డర్, క్రైమ్, ట్రాఫిక్, స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ స్పెషల్ బ్రాంచ్, సైబర్ క్రైమ్ తదితర విభాగాల పనితీరును సమగ్రంగా సమీక్షించారు. ఆయా విభాగాల అధికారులు తమ పరిధిలోని ప్రస్తుత పరిస్థితులు, ఎదురవుతున్న సవాళ్లు, నేరాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలు, పరస్పర సమన్వయాన్ని బలోపేతం చేసే అంశాలపై ప్రజెంటేషన్లు ఇచ్చి, కార్యాచరణ ప్రణాళికలు మరియు అమలు వ్యూహాలను సమావేశంలో వివరించారు.రౌడీ షీటర్లు, చరిత్ర కలిగిన నేరస్తులు, అంతర్రాష్ట్ర ముఠాల కదలికలపై సమాచార మార్పిడి, సంయుక్త చెక్‌పోస్టులు, పెట్రోలింగ్, వాట్సాప్ గ్రూపుల ద్వారా తక్షణ సమాచార వినిమయం, మిస్సింగ్ వ్యక్తులు, గుర్తుతెలియని మృతదేహాల వివరాల భాగస్వామ్యం, సీసీటీవీ కవరేజ్ విస్తరణ, సైబర్ నేరాలపై సమన్వయం, వీఐపీ బందోబస్తు, మతపరమైన పండుగలు, భారీ కార్యక్రమాల సందర్భంగా ట్రాఫిక్ నిర్వహణ, సామాజిక ఉద్రిక్తతల నివారణ, సహజ విపత్తుల సమయంలో సంయుక్త చర్యలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సమావేశంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, ఐపీఎస్., జాయింట్ సీపీ (ట్రాఫిక్) సన్‌ప్రీత్ సింగ్, హైదరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయెల్ డావిస్, ఐపీఎస్., కూకట్పల్లి డీసీపీ రితిరాజ్, ఐపీఎస్., కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటి రెడ్డి, ఐపీఎస్., శేరిలింగంపల్లి డీసీపీ సి.హెచ్. శ్రీనివాస్, ఐపీఎస్., ట్రాఫిక్ డీసీపీ ఐ శేషాద్రిని రెడ్డి, ఐపీఎస్., డీసీపీ (క్రైమ్స్) ముత్యం రెడ్డి, డీసీపీ (స్పెషల్ బ్రాంచ్) వై.వి.ఎస్. సుధీంద్ర, డీసీపీ (మహిళా, శిశు భద్రత విభాగం) సృజన కరణం, డీసీపీ (సైబర్ క్రైమ్స్) పుష్ప, రోడ్ సేఫ్టీ విభాగం అధికారులు, మెడ్చల్ ఎస్వోటీ డీసీపీ, ఎస్వోటీ డీసీపీ శోభన్ కుమార్, ట్రాఫిక్ డీసీపీ–2 రవికుమార్, వివిధ సరిహద్దు కమిషనరేట్లు, జిల్లాల పోలీసు అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.