
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి. వీరేశం జహీరాబాద్, జూలై 6: సురక్షిత మంచినీటి పథకం ద్వారా ఇంటింటికి సరఫరా అవుతున్న నీటిని మాత్రమే సేవించాలని ఆర్ డబ్ల్యూ ఎస్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మమత సూచించారు. జహీరాబాద్ మండలం కొత్తూరు (బి ) గ్రామంలో సోమవారం జల్ మహోత్సవం కార్యక్రమం లో పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం ఇంటింటికి సరఫరా చేస్తున్న సురక్షిత మంచి నీటిని వాడుకోవడం ద్వారా డయేరియా, కలరా లాంటి రోగాలకు దూరంగా ఉంటారని పేర్కొన్నారు. చెరువులు, నదుల ద్వారా వచ్చే నీటిని వివిధ పద్ధతులలో శుద్ధి చేసిన తరువాతనే ప్రజలకు మంచినీటిని అందిస్తున్నట్లు వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోను డబ్బా నీటిని తాగవద్దని సూచించారు. డబ్బా నీటిలో ఏ మాత్రం మినరల్స్ ఉండవని, పైగా కీళ్ళ నొప్పుల బారిన పడుతారని చెప్పారు. గ్రామ సర్పంచ్ మహాదేవి మాట్లాడుతూ అధికారులు చెప్పినట్లు ప్రభుత్వం సరఫరా చేస్తున్న నీటినే సేవించాలని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గ్రామంలో రక్షిత మంచినీటినే వాడుకోవాలని ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. గ్రామ కార్యదర్శి సంగారెడ్డి, మల్లన్న, రాములు, మోహన్, దేవయ్య, చోటు మియా తదితరులు పాల్గొన్నారు