
*రోడ్డుపై నీటిమడుగులో కూర్చుని నిరసన తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే*
బిచ్కుంద. జూన్ 21 జనం న్యూస్కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని సెంట్రల్ లైటింగ్ రోడ్డు పనులు ప్రారంభించాలని బిఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే రోడ్డుపై నీటిమడుగులో కూర్చొని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే సాంక్షన్ అయిన రోడ్డు పనులు కాంగ్రెస్ పాలనలో రెండున్నర సంవత్సరాలు గడిచినప్పటికిని పూర్తికాక దుస్థితి నీ ఎదుర్కోవడానికి గల కారణం కాంగ్రెస్ పాలకులకు సెంట్రల్ లైటింగ్ రోడ్డు పనుల పైన చిత్తశుద్ధి లేకపోవడమేనని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలకులకు ప్యాకేజీల మీద ఉన్న శ్రద్ధ పాలనపై లేదని ప్రజాజీవనం అస్తవ్యస్తమవుతున్నప్పటికిని కాంగ్రెస్ నాయకులు చలిమంట కాల్చుకుంటున్నారని నాకేంటి, మాకేంటి అన్న ధోరణిలోనే కాంగ్రెస్ చోటామోటా నాయకులు అందరూ ఎవరి ధీమాలో వారు ఉన్నారని ప్రజాల ఇబ్బందుల గురించి వారికి చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. కందర్ పల్లి నుండి మద్దెల చెరువు వరకు ఏడు మీటర్ల రోడ్డు వెడల్పుతో పనులు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికిని పుల్కల్ గ్రామ శివారు వరకు చేసి ఎందుకు అర్ధాంతరంగా నిలిపివేశారు కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. పూర్తిస్థాయిలో గుంతల మయమైన రహదారిపై ప్రజలు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొని జరగరాని సంఘటనలు జరిగితేనే స్పందిస్తారా అప్పటివరకు మొద్దు నిద్రలో ఉంటారా అంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. వారం రోజుల వ్యవధిలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టలేనట్లయితే రోడ్డు పక్కన టెంట్ వేసి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.