
అన్నదానం, విద్యార్థులకు కిట్లు, పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాల పంపిణీ
జనం న్యూస్ సెప్టెంబర్ 2 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను రామచంద్రపురం నియోజవర్గం కాజులూరు మండలంలో అత్యంత ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూటమి పార్టీ సీనియర్ నాయకులు శ్రీ వాసంశెట్టి సత్యం హాజరై జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ ప్రజాసేవలో మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో సార్థకం చేశారు. కాజులూరులో జనసేన నాయకులు అన్యం శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో, అలాగే గొల్లపాలెం గ్రామంలో జనసేన నాయకులు డేగల సతీష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించి వందలాది మందికి భోజనాలు అందించారు. అదేవిధంగా కాజులూరులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ చేసి వారి విద్యాభివృద్ధికి ప్రోత్సాహం అందించారు. గొల్లపాలెం గ్రామంలో సమాజ పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించి నూతన వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తికి ప్రతిబింబంగా నిలిచాయి.ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగానే కాకుండా గొప్ప మానవతావాదిగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారని అన్నారు. ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటూ, సమాజంలోని బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. సేవా కార్యక్రమాల ద్వారా జన్మదినాన్ని అర్థవంతంగా నిర్వహించిన జనసేన నాయకులు, జనసైనికులను ప్రత్యేకంగా అభినందించారు. యువతలో సామాజిక బాధ్యతను పెంపొందిస్తూ, సేవా తత్వాన్ని ప్రోత్సహిస్తున్న పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రతి కార్యకర్త ఆచరణలో పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత మరియు గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.