
చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి
జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియాదేవి ఆదేశం
జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహణ
జనం న్యూస్ జూన్ 27 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) సమాజంలో వెనుకబడిన వర్గాలపై వివక్షను, అంటరానితనం అఘాయిత్యాలను అరికట్టడానికి, ఎస్సీ, ఎస్టీల హక్కులను కాపాడటంలో పౌర హక్కుల రక్షణ చట్టం అట్రాసిటీ నిరోధక చట్టాలను జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియాదేవి అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, పౌర హక్కుల చట్టంపై జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరుగుతున్న అఘాయిత్యాల నివారణ, నమోదైన కేసుల విచారణ పురోగతి, బాధితులకు అందుతున్న తక్షణ సహాయం, పునరావాస చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమగ్రంగా సమీక్షించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పౌర హక్కుల పరిరక్షణ చట్టం, అట్రాసిటీ నిరోధక చట్టాలు చాలా పదునైనవని, ఇవి ఆయా వర్గాలకు రక్షణ కవచాలని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం అందించే విషయంలో ఎలాంటి జాప్యం జరగకూడదని, ప్రతి కేసును సున్నితంగా, కాలపరిమితిలోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. జిల్లాలో షెడ్యూల్డ్ కులాల జనాభా సాంద్రత అధికంగా ఉన్నందున, కేసులు నమోదు కాకుండా ముందస్తుగా ప్రజల్లో విస్తృత అవగాహ న కార్యక్రమాలు నిర్వహించి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలన్నారు.పోలీస్, రెవెన్యూ, సాంఘిక సంక్షేమ శాఖల అధికారులు పరస్పర సమన్వయం తో పనిచేసి బాధితులకు సకాలంలో పరిహారం, పునరావాసం మరియు నైతిక, చట్టపరమైన మద్దతు అందేలా చూడాలని ఆదేశించారు. తొలుత జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు గత సమావేశపు మినిట్స్‌పై తీసుకున్న చర్యలను సభకు వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు 34 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వీటిలో ఎఫ్ఐఆర్ దశలో 23 కేసులు గాను రూ.13,25,000 నష్ట పరిహారంగా మంజూరయిందన్నారు. చార్జి షిటు దశలో 11 కేసులకు గాను రూ 10,50,000 నష్ట పరిహారంగా మంజూరయిందన్నారు. 34 కేసులలో రెండు కోర్టు స్టే దశలోనూ 16 చార్జి సీటు దశలోను, 6 కేసులు కుల ధ్రువీకరణ దశలోను, 4 కేసులకు సంబంధించి అరెస్టు దశలోనూ, మెడికల్ సంబంధించి 2 కేసులు, ఇన్వెస్టిగేషన్ దశలో 3 కేసులు, కోర్టు ఆదేశాల జారీ కొరకు ఒక కేసు పెండింగ్ లో ఉందన్నారు. నాన్-అఫీషియల్ కమిటీ సభ్యులు . వెంట్రు సుదీర్, రజిని శ్రీనివాస, రాజాలు మాట్లాడుతూ దళిత వాడలలో డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణం, జలజీవన్ మిషన్ ద్వారా తాగునీటి వసతులు కల్పించాలని మరియు వసతి గృహాలకు సంక్షేమ అధికారులను తక్షణం నియమించాలని కోరారు. దీనిపై జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ, సంబంధిత శాఖల ద్వారా ఈ సమస్యల తక్షణ పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ సమీక్షా సమావేశంలో అడ్మిన్ ఎస్పీ మహేంద్ర మత్తె, డి.ఆర్.ఓ వి. సుబ్బారావు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారిణి పి. జ్యోతిలక్ష్మి దేవి, ఆర్.డి.ఓలు జి.వి.వి. సత్యనారాయణ, జి. మమ్మీ, ఎ. సరళావతి, డీఎస్పీ .టి ఎస్ ఆర్ కె ప్రసాద్ ,మురళీమోహన్ మరియు ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.