
జనం న్యూస్: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో ఆదివారం తెల్లవారుజామున సంభవించిన అగ్నిప్రమాదంలో కనీసం తొమ్మిది మంది సజీవదహనం అయ్యారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. ఓ ఇంట్లోని ఏసీ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... వివేక్ విహార్ ప్రాంతంలో ఉన్న ఓ నాలుగు అంతస్తుల రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బిల్డింగ్‌లోని రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నించారు. మంటలను అదుపులోకి చేయడానికి మొత్తంగా 12 అగ్నిమాపక వాహనాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. అయితే మంటలు వేగంగా ఎగసిపడి మూడో, నాలుగో అంతస్తులకు కూడా వ్యాపించాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది భవనం లోపల మంటల్లో చిక్కుకున్న పలువురిని రక్షించారు. అలాగే, గాయాలతో ఉన్నవారిని వెంటనే చికిత్స నిమిత్తం గురు తేగ్ బహదూర్ ఆసుపత్రికి తరలించారు. అయితే దాదాపు రెండు గంటల పాటు శ్రమించిన అనంతరం ఉదయం 6 గంటల సమయానికి మంటలు అదుపులోకి వచ్చాయి. అయినప్పటికీ... భవనంలో నుంచి పొగ వెలువడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఇక, ఈ ప్రమాదంలో భవనంలోని అనేక భాగాలు కాలిపోయాయి. ‘‘తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో అగ్నిప్రమాదం గురించి మాకు ఒక సమాచారం అందింది. వెంటనే అగ్నిమాపక వాహనాలను, స్థానిక పోలీసులను ఘటనా స్థలానికి పంపాము. మంటలను అదుపులోకి తీసుకురావడానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది, ఆ తర్వాత భవనంలో గాలింపు చర్యలు చేపట్టాము’’ అని షాదారా డీసీపీ రాజేంద్ర ప్రసాద్ మీనా తెలిపారు. ఇక, అయితే ఈ ప్రమాదంలో మరణించినవారి మృతదేహాలను వెలికితీసినట్టుగా పోలీసులు చెప్పారు.