
జనం న్యూస్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని (Tirumala Temple) దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా మారింది. శనివారం (మే 2) రోజున తిరుమల శ్రీవారిని 91,005 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. 36,257 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.37 కోట్ల రూపాయలుగాఉంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ప్రస్తుతం ఏటీజీహెచ్ వరకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం (మే 3) ఉదయం ఉన్న సమచారం ప్రకారం... నేడు సర్వదర్శన టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం పడుతుంది. ఇక, తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌ల వద్ద శనివారం రోజున 13 వేల సర్వదర్శన టోకెన్లు జారీ చేశారు. వీరికి ఆదివారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం కల్పించనున్నారు. ఇక, శ్రీవారి నడకదారి భక్తులకు మరో రెండు వేల సర్వదర్శన టోకెన్లు జారీ చేశారు. వేసవి నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక రిక్వెస్ట్ చేసింది. తిరుమలలో రద్దీ దృష్ట్యా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తమ వంతు వచ్చే వరకు సంయమనంతో వేచిచూడాలని కోరింది. తిరుమల క్యూ లైన్‌లోని కొందరు భక్తుల చేత రెచ్చగొట్టేలా మాట్లాడించడం తగదని పేర్కొంది. ఇటువంటి చర్యల పట్ల భక్తులు కూడా అప్రమత్తంగా ఉండాలని టీడీడీ కోరింది.