
జనం న్యూస్ అక్టోబర్ 23: అమలాపురం మున్సిపల్ ఎన్నికల్లో 28వ వార్డు నుంచి కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆ పార్టీ సీనియర్ నేత మోకా వెంకట సుబ్బారావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. శుక్రవారం నిర్వహించిన ఇంటింటా ప్రచారంలో ఆయన ఉత్సాహంగా పాల్గొంటూ సుడిగాలి పర్యటనలతో వార్డులో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ తన విజయావకాశాలను మెరుగుపరుచుకునే దిశగా ముందుకు సాగుతున్నారు. వార్డులోని ప్రజలను నేరుగా కలుసుకుంటూ వారి సమస్యలు, అవసరాలను తెలుసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, వార్డులో అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కట్టుబడి ఉంటానని ఓటర్లకు భరోసా ఇస్తున్నారు. మరోవైపు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రజలకు చేరువవుతూ, ప్రజలు తమ సమస్యలను వాట్సాప్ ద్వారా తెలియజేస్తే వాటిని పరిశీలించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాననే సందేశాన్ని ప్రచార పోస్టర్ ద్వారా అందిస్తున్నారు. కూటమి పార్టీల మద్దతుతో బరిలో ఉన్న మోకాకు ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో బోనం వరప్రసాద్, యర్రమిల్లి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.