
జనం న్యూస్ జూలై 5 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాన్సెప్ట్ జిల్లా రామచంద్రపురం రామచంద్రపురం మున్సిపాలిటీ పరిధిలో రూపాయలు 73 లక్షల 50 వేల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఐదు అభివృద్ధి పనులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శనివారం భూమి పూజ చేసి ప్రారంభించారు.పట్టణ సుందరీకరణలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ ఇన్ గేట్ నుంచి రాజగోపాల్ సెంటర్ వరకు సెంట్రల్ డివైడర్ నిర్మాణం, 2వ వార్డు కొత్తూరు రోడ్డు, 28వ వార్డు చింతపల్లి సురన్న నగర్, శ్రీ సిటీ లేఅవుట్, 15వ వార్డు లలితా నగర్ పార్కు వద్ద సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రామచంద్రపురం పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం లక్ష్యమని అన్నారు. ప్రజలకు మెరుగైన రహదారులు, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని తెలిపారు. పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. గత రెండేళ్లలో పట్టణంలో రూపాయలు 50 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. రానున్న ఆరు నెలల్లో మరిన్ని నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ సీనియర్ నేత వాసంశెట్టి సత్యం, మున్సిపల్ కమిషనర్ కె వి ఆర్ ఆర్ రాజు, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ శ్రీకాంత్, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు అక్కల రిశ్వంత్ రాయ్, జనసేన ఇంచార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉండవల్లి శివ, అధికారులు, కూటమి పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.