
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం జహీరాబాద్, అక్టోబర్ 11: శ్రీల ప్రభుపాదుల ఇస్కాన్, జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో 228వ నగర సంకీర్తన ఆదివారం పట్టణంలోని శాంతినగర్ హనుమాన్ మందిరంలో భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భక్తులు హరినామ సంకీర్తనలో పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కంది అక్షయ పాత్ర బాధ్యులు విభీషణ్ ప్రభూజీ భగవద్గీత 3వ అధ్యాయం, 7వ శ్లోకంపై ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించిన కర్మయోగం, కర్తవ్య నిర్వహణ, భగవంతుని పట్ల భక్తిభావంతో సేవ చేయడం వంటి అంశాలను ఆయన వివరించారు. కేవలం బాహ్య ఆచారాలకే పరిమితం కాకుండా, మనసును భగవంతునిపై నిలిపి, నిష్కామ భావంతో విధులను నిర్వహించాలని సూచించారు.హరినామ సంకీర్తన ద్వారా మనశ్శాంతి, ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతాయని, ప్రతి ఒక్కరూ భగవన్నామ స్మరణలో పాల్గొని ఆధ్యాత్మిక విలువలను తమ జీవితాల్లో అలవర్చుకోవాలని విభీషణ్ ప్రభూజీ పిలుపునిచ్చారు.అనంతరం భక్తులు సామూహికంగా హరినామ సంకీర్తన నిర్వహిస్తూ శోభాయాత్ర నిర్వహించారు. భగవన్నామాన్ని స్మరిస్తూ నృత్యాలు చేస్తూ తన్మయత్వంలో మునిగిపోయారు.ఈ కార్యక్రమంలో హనుమాన్ మందిరం అధ్యక్షులు వెంకట్ సాగర్ ప్రసాదాన్ని వితరణ చేయగా, చిత్రలేఖనం పోటీలలో విజేతలకు ప్రభూజీ బహుమతులు ప్రదానం చేశారు. నగర సంకీర్తనలో భక్తులతో పాటు స్థానిక శాంతినగర్ భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.