ఆంధ్రప్రదేశ్

*రైతులను వంచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం – ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై. నరోత్తం

*రైతులను వంచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం – ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై. నరోత్తం

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జహీరాబాద్, అక్టోబర్ 14, 2026: మాది రైతు ప్రభుత్వం, రైతులకు కావాల్సిన సాగునీరు, 24 గంటల విద్యుత్ అందిస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఎల్ నీనో అనే బూచి చూపెట్టి రైతులకు సాగునీరు, కరెంట్ ఇవ్వడం లేదని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై. నరోత్తం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం తీసుకుంటే 127.58 లక్షల ఎకరాలకు 1276 టీఎంసీల నీరు అవసరం ఉండగా, కేవలం 590.57 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 268 టీఎంసీలు భూగర్భ జలాలతో సాగు చేయాల్సి ఉంది. వీటిని తీయాలంటే విద్యుత్ అవసరం. ఎల్ నీనో వస్తుందని గత 9 నెలల క్రితమే తెలిసినా, అవసరమైన సాగునీటిని కాళేశ్వరం నుండి తీసుకోలేదు. రాష్ట్రానికి 19,892 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండగా, మన దగ్గర ఉత్పత్తి అయ్యేది కేవలం 9015 మెగావాట్లు మాత్రమే. ఎల్ నీనో ప్రభావం వల్ల విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా బొగ్గు నుండే జరుగుతుంది. ఎల్ నీనో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా పడటం వల్ల విద్యుత్ ఉత్పత్తి 1000 మెగావాట్ల వరకు తగ్గవచ్చు. ప్రభుత్వం సరైన రీతిలో ఆలోచిస్తే యాదాద్రి దగ్గర ఉన్న థర్మల్ ప్లాంట్ (వైటీపీఎస్) పూర్తి సామర్థ్యం 4000 మెగావాట్లు, ఈ లోటు తీరేది. ప్రభుత్వం ముందస్తుగా ఆలోచిస్తే ఈ పవర్ ప్లాంట్ ను పూర్తిగా రన్ చేసేది, గోదావరిలో ఉన్న నీటిని నిల్వ చేసేది మరియు విద్యుత్ ను ప్రత్యామ్నాయంగా కొనుగోలు చేసేది. కానీ అవన్నీ ఏమీ చేయకుండా ఎల్ నీనో అనే బూచి చూపెట్టి రైతులను వంచిస్తున్నది. జహీరాబాద్ నియోజకవర్గ పరిస్థితి చూస్తే: ఇక్కడ 2,10,000 ఎకరాల సాగు చేసేవారు ఉన్నారు. అందులో 30% అనగా సుమారు 65 వేల ఎకరాల్లో సాగునీటితో పంటలు పండిస్తారు. మిగతాదంతా వర్షాధార పంటలే. 64 వేల ఎకరాలలో 3000 ఎకరాలు చెరువులు, కుంటలతో పండిస్తారు, మిగతాదంతా భూగర్భ జలాధారమే. అంటే వీటికి విద్యుత్ అవసరం, కానీ ఆ విద్యుత్ ను ప్రభుత్వం సరైన రీతిలో సరఫరా చేయడం లేదు. 24 గంటల కరెంట్ అన్నారు కానీ అనధికారంగా 12 గంటలు ఇస్తున్నారు, అది కూడా నాణ్యమైన విద్యుత్ సరఫరా ఎక్కడా లేదు. అందులో ప్రతిరోజు 10 నుండి 12 సార్లు కరెంట్ కోతలు విధిస్తున్నారు. నియోజకవర్గానికి 250 మెగావాట్ల ఫిక్స్ లోడ్ అవసరం ఉండగా, దాంట్లో 50% కూడా సప్లై చేయడం లేదు. 9 నెలల క్రితమే ఎల్ నీనో వస్తుందని తెలిసినా సింగూర్ నీటిని మొత్తం వదిలిపెట్టారు. అది ఎండిపోవడం, చుట్టుపక్కల భూగర్భ జలాలు అడుగంటడం వల్ల రైతులు తమ చేతికి వచ్చిన పంటకు నీళ్లు అందించలేకపోతున్నారు. మోటార్లు కాలిపోతున్నాయి, రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వీటన్నింటికీ కారణం ప్రభుత్వ ముందుచూపు లేకపోవడమే. ఇకనైనా ప్రభుత్వం తమ తప్పును సరిదిద్దుకుని రైతులకు సరిపడా సాగునీరు, విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ప్రజాగ్రహానికి గురికాక తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో కేతకి ఆలయ మాజీ చైర్మన్ హన్మన్న పాటిల్, మాజీ సర్పంచ్ శంకర్, నాయకులు రామచంద్రారెడ్డి, శివకుమార్, ఎస్. గోపాల్, ఎం. మల్లేశం, వీర్ సంగప్ప, రాజశేఖర్ శెట్కార్, పవన్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్