వైరల్ వార్తలు

దసరా పండుగను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించాలి. – జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్

దసరా పండుగను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించాలి. – జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్

జ నం న్యూస్ 18 అక్టోబర్ వికారాబాద్ జిల్లా :- వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా దసరా పండుగ సందర్భంగా నిర్వహించే బతుకమ్మ వేడుకలు, రావణ దహనం, దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ద్వారా పలు సూచనలు, మార్గదర్శకాలను వివరించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 407 దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించిన నేపథ్యంలో, ప్రతి విగ్రహం నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేలా ముందస్తు ప్రణాళికతో అవసరమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. నిమజ్జన మార్గాలను ముందుగానే పరిశీలించి, అవసరమైన ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెరువులు, కుంటలు, ఇతర జలాశయాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రమాదకర ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. నిమజ్జన సమయంలో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఉత్సవ నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే రావణ దహన కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున, ఆయా ప్రాంతాల్లో జనసమూహాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజల భద్రతకు సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమాలు జరిగే ప్రదేశాలను ముందుగానే పరిశీలించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. బతుకమ్మ వేడుకలు, రావణ దహనం, దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలన్నీ ప్రశాంతంగా జరిగేలా అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ గారు అధికారులకు సూచించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించి, దసరా పండుగను శాంతియుతంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఆమె కోరారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీ రాజేష్ మీనా, ఐపీఎస్, డీఎస్పీలు, సీఐలు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

ఇ-పేపర్