జనం న్యూస్, 22 అక్టోబర్, ఝరాసంగం గ్రామం.( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి ) సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని, ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఝరాసంగం గ్రామంలో, అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా సూర్యోదయం కాగానే ఆర్పేయాల్సిన వీధిలైట్లు ఇక్కడ మధ్యాహ్నం కావస్తున్న ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. గురువారం ఉదయం 11:30 గంటలైనా, గ్రామంలోని పలు వీధుల్లో వీధి దీపాలు ఆర్పకపోవడంతో స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఒకపక్క విద్యుత్ ఆదా చేయాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే, ఇక్కడ మాత్రం అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ లోపం వల్ల విలువైన విద్యుత్తు వృధా అవుతుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వేలాది మంది భక్తులు, ప్రజలు తిరిగే ఝరాసంగం లాంటి పెద్ద గ్రామంలో ఇలాంటి నిర్లక్ష్యం సరికాదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విధిలైట్లను సకాలంలో ఆర్పేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ వృధాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.