250 మంది విద్యార్థుల ఉత్సాహభరిత పాల్గొనడం.. జిల్లా స్థాయికి ప్రతిభావంతుల ఎంపిక
జనం న్యూస్ నవంబర్ 12:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్గట్లలో 70వ పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్) కమ్మర్‌పల్లి జోనల్ స్థాయి క్రీడా పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కమ్మర్ పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల మండలాలకు చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.అండర్-14, అండర్-17 విభాగాల్లో బాలబాలికలకు కబడ్డీ, ఖోఖో పోటీలు నిర్వహించగా, సుమారు 250 మంది విద్యార్థులు తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేశారు.ఈ సందర్భంగా కన్వీనర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించాలని ఆకాంక్షించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రామ సర్పంచ్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆటల్లో గెలుపోటములు సహజమని, గెలిచినవారు గర్వపడకుండా, ఓడినవారు నిరుత్సాహపడకుండా క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని పిలుపునిచ్చారు.