జనం న్యూస్ | సెప్టెంబర్ 21: హర్యానాలోని సోనిపట్‌లో ఆరు నెలల పసికందుపై పిట్‌బుల్ కుక్క దాడి చేసిన ఘటన కలకలం రేపింది. సిక్కా కాలనీలో సెప్టెంబర్ 14న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. చిన్నారి తన బువా ఒడిలో ఉండగా, సమీపంలోని ఓ ఇంటి గేటు తెరుచుకోవడంతో బయటకు వచ్చిన పిట్‌బుల్ ఒక్కసారిగా వారిపై దాడి చేసింది. తొలుత మహిళపై దాడి చేసిన కుక్క.. అనంతరం ఆమె ఒడిలో ఉన్న చిన్నారిని పట్టుకుంది. దాడి తీవ్రతకు చిన్నారి కిందపడిపోగా, కుక్క అతడిని పట్టుకుని రోడ్డుపై కొంతదూరం ఈడ్చుకెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది. చిన్నారిని రక్షించేందుకు మహిళ ప్రయత్నించగా ఆమె కూడా గాయపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి చేరుకుని కుక్కను చిన్నారి నుంచి వేరు చేసేందుకు ప్రయత్నించి, చివరకు అతడిని రక్షించారు. ఈ దాడిలో చిన్నారి ముఖం, పొత్తికడుపు, చేతులు సహా పలు శరీర భాగాల్లో తీవ్ర గాయాలైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తొలుత ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించగా, పొత్తికడుపులో గాయాలకు శస్త్రచికిత్స చేసి సుమారు 20 కుట్లు వేసినట్లు వెల్లడించారు. చికిత్స ఖర్చులు పెరగడంతో అనంతరం చిన్నారిని రోహ్‌తక్‌లోని PGIMS ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చిన్నారికి చికిత్స కొనసాగుతుండగా, తాజా సమాచారం ప్రకారం అతడి పరిస్థితి కొంత మెరుగుపడినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో వైరల్ కావడంతో పెంపుడు కుక్కల నియంత్రణ, యజమానుల బాధ్యత, చిన్నారుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. అయితే ఈ ఘటనపై ఇప్పటివరకు చిన్నారి కుటుంబం పోలీసులకు అధికారిక ఫిర్యాదు చేయలేదని సోనిపట్ పోలీసులు తెలిపారు. ఫిర్యాదు అందిన తర్వాత నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.