
జనం న్యూస్ నవంబర్ 3 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎన్డీయే కూటమి అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. ముఖ్యంగా అనకాపల్లి జోన్ పరిధిలో జరిగిన ఆరు వార్డుల ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేసి తమ సత్తా చాటారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన అనంతరం ఎన్నికల అధికారులు విజేతల వివరాలను అధికారికంగా ప్రకటించారు. అనకాపల్లి జోన్లోని మొత్తం 6 వార్డుల్లో జనసేన పార్టీ అత్యధికంగా 3 వార్డులను కైవసం చేసుకోగా, తెలుగుదేశం పార్టీ (తెదేపా) 2 వార్డుల్లోనూ, భారతీయ జనతా పార్టీ (భాజపా) 1 వార్డులోనూ ఘన విజయం సాధించాయి. గెలిచిన 6 వార్డుల అభ్యర్థుల వివరాలు : 107 వార్డు అభ్యర్థి మాదంశెట్టి చిన్న తల్లి (టిడిపి)108 కొణతాల సింధుజ (టిడిపి) 109 బుద్ధ జ్యోతి (జనసేన) 110 తాడి శాంతి కుమారి (జనసేన) 111 పలక యశోద రవి (బిజెపి) 112 ఆళ్ల వైష్ణవి (జనసేన) గెలుపొందినట్లు అధికారికంగా తెలిపారు. లెక్కింపుప్రారంభమైనప్పటి నుంచే కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చారు. మూడు పార్టీల శ్రేణులు సమన్వయంతో పనిచేయడం, క్షేత్రస్థాయిలో ఓటర్ల నుంచి లభించిన విశేష ఆదరణతోనే ఈ అఖండ విజయం సాధ్యమైందని కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు. అధికారులు ఫలితాలను వెల్లడించడంతో అనకాపల్లిలో పండుగ వాతావరణం నెలకొంది. కౌంటింగ్ కేంద్రం వద్దకు భారీగా చేరుకున్న తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ విజయోత్సవ సంబరాల్లో మునిగి తేలుతున్నారు