జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 7 రిపోర్టర్ సలికినిడి నాగరాజు మద్యం తాగుతూ జల్సాగా తిరిగేదానికి అలవాటు పడిన యువకుడు అడిగిన డబ్బులు ఇవ్వలేదని కుటుంబ సభ్యులపై చాకుతో దాడిచేసి హత్యాయత్నం చేసిన సంఘటన గురువారం రాత్రి చిలకలూరిపేట పట్టణంలో చోటు చేసుకుంది. అర్బన్ సీఐ రమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… గనిపిశెట్టి కృష్ణారావు, వెంకాయమ్మ దంపతులు పట్టణంలోని రజకకాలనీలో నివాసం ఉంటున్నారు. కుమారుడు మణికుమార్ కు 29 సంవత్సరాలు. గతంలో కాళ్లు దెబ్బతిన్నప్పుడు వికలాంగ పింఛన్ పెట్టుకున్నాడు. ప్రస్తుతం బాగున్నా అతనికి వికలాంగ పింఛన్ వస్తుంది. తండ్రిని బెదిరించి నగదు తీసుకుని జల్సాగా తిరగడం అలవాటు చేసుకున్న మణికుమార్ రోజుల తరబడి ఇంటికి కూడా రాడు. ఇటీవల వికలాంగ పింఛన్ కోసం వచ్చిన మణికుమార్ సోదరి ఇంటి వద్ద ఉంటూ రూ.30వేలు డబ్బులు ఇవ్వాలంటూ తండ్రిని బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలో తండ్రి కృష్ణారావు తన స్నేహితుడైన భాస్కర్ సెంటర్ లోని టింబర్ డిపో యజమాని హరీష్ వద్దకు డబ్బులు అడిగేందుకు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న మణికుమార్ అక్కడకు చేరుకుని రూ.30వేలు ఇవ్వాలంటూ తండ్రిని ఒత్తిడి చేశాడు. గొడవ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కూడా అక్కడకు వచ్చారు. ఒక్కసారిగా అవేశంగా మణికుమార్ ముందస్తు ప్రణాళిక ప్రకారం జేబులో ఉన్న పదునైన చాకు తీసి తండ్రి కృష్ణారావు, సోదరి నాగలక్ష్మి, పిన్ని రాజేశ్వరి, సర్ది చెబుతున్న టింబర్డిపో యజమాని హరీష్ ల పై దాడి చేశాడు. అడ్డుకోబోయిన చుట్టుపక్కలవారిని సైతం బెదిరించాడు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురిని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న అర్బన్ సీఐ రమేష్ ,ఎస్సై చెన్నకేశవులు ఆసుపత్రికి వచ్చి క్షతగాత్రులను విచారించారు. వారిలో కృష్ణారావు, నాగలక్ష్మిలను మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్ కు పంపించారు. కేసు నమోదు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.