జనం న్యూస్ 13 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా గజపతినగరం పట్టణంలో ఇటీవల వరుసగా మూడు చోట్ల షాపుల షట్టర్లు పగులగొట్టి నిందితులు నేరాలకు పాల్పడగా, గజపతినగరం పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారని డిఎస్పీ భవ్య రెడ్డి తెలిపారు.
ఈ నేరాలను తీవ్రంగా పరిగణించి, వాటిని చేధించేందుకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ గారి ఆదేశాలతో ప్రత్యేకంగా ఒక టీంను ఏర్పాటు చేశామన్నారు. ఈ తరహా నేరాలకు పాల్పడేది కర్నాటక, మహారాష్ట్ర లకు చెందిన నేరస్తుల ముఠాగా గుర్తించామన్నారు. ఈ ముఠా సభ్యులు ఎటువంటి భయం లేకుండా షట్టర్లు లిఫ్ట్ చేసి, నగదు, వస్తువులు దోచుకొని పోతారన్నారు. నేరస్తుల ఆచూకీని సాంకేతికత ఆధారంగా గుర్తించి గజపతినగరంలో నేరాలకు పాల్పడిన వారిని గుర్తించామన్నారు. షేక్ బాషా, రావుల రమణ, శ్రీను నాయక్, బుల్లిపల్లి కిరణ్ కుమార్ అనే నిందితులు మార్చి 11 రాత్రి గజపతినగరం పట్టణంలో మళ్ళీ నేరాలకు పాల్పడే ఉద్దేశ్యంతో రెక్కీ నిర్వహించి, గజపతినగరం రైల్వే ట్రాక్ వెంబడి వెళ్తుండగా వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో వారిని గజపతినగరం పోలీసులు అరెస్టు చేశారన్నారు. నిందితులు పోలీసులను చూచి, పారిపోయేందుకు ప్రయత్నించగా, వారిని వెంబడించి, పట్టుకున్నామన్నారు. అరెస్టు కాబడిన నిందితుల నుండి ఒక లాప్టాప్, రూ.88,720/- ల నగదు, 9 స్మార్ట్ ఫోన్లు, 3 గోల్డ్ కలర్ రిస్ట్ వాచీలను రికవరీ చేశామని బొబ్బిలి డిఎస్పీ తెలిపారు. అరెస్టు కాబడిన నిందితుల పై ఇప్పటికే నెల్లూరు, తిరుపతి, తుని, విజయనగరం టౌన్, బొండపల్లి, ఎస్.కోట పోలీసు స్టేషన్ లలో 9 కేసులు ఉన్నాయన్నారు. విచారణలో నిందితులు తిరుపతి, గజపతినగరంలో కూడా గతంలో నేరాలకు పాల్పడినట్లుగా అంగీకరించారని డిఎస్పీ తెలిపారు. ఈ కేసులో గజపతినగరం ఎస్సై కే.లక్ష్మణరావు మరియు పోలీసు సిబ్బంది ఎంతో ధైర్యంతో క్రియాశీలకంగా పని చేసి, నిందితులను అరెస్టు చేశారన్నారు. గజపతినగరం సిఐ జి.ఎ.వి.రమణ కూడా ఎస్సై మరియు సిబ్బందికి ఎప్పటికప్పుడు సమయానుకూలంగా ఆదేశాలు ఇస్తూ, ఈ నేరాలను చేధించుటలో సమర్ధవంతంగా పని చేశారని బొబ్బిలి డిఎస్పీ జి.భవ్య రెడ్డి అభినందించారు. గజపతినగరం పీఎస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో గజపతినగరం సిఐ జి.ఎ.వి.రమణ, ఎస్సై కే.లక్ష్మణరావు పాల్గొన్నారు.