జనం న్యూస్ మార్చి 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రాక్షస రాజు హిరణ్యకశపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తుంటాడు. విష్ణుమూర్తిని స్మరించడం హిరణ్యకశపుడికి ఏ మాత్రం నచ్చదు. దీంతో ప్రహ్లాదుడిని చంపేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతని రాక్షస సోదరి హోళికను పిలుస్తాడు. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుడిని అగ్నిలో ఆహుతి చేయాలని హోళికను హిరణ్యకశపుడు కోరుతాడు. దీంతో ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని హోళిక మంటల్లో దూకుతుంది. అయితే విష్ణుమూర్తి తన ఆధ్యాత్మిక శక్తితో ప్రహ్లాదుడిని ప్రాణాలతో కాపాడుతాడు. హోళిక మాత్రం మంటల్లో కాలిపోతుంది. ఈ క్రమంలో హోళికా దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారనే ప్రచారం ఉంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రివేళ హోలిక దహనం నిర్వహిస్తారు.హోలీ పండుగకు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. వసంత కాలంలో వాతావరణం చలి కాలం నుంచి ఎండా కాలానికి మారుతుంది. వాతావరణ మార్పుల వల్ల వైరల్ జ్వరం, జలుబు వంటి వ్యాధులు సంభవిస్తాయి. ఈ జ్వరాల నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవడం ద్వారా దూరమవుతాయనినే వాదన ఉంది.తడి రంగుల కోసం మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు. అది ఔషధ లక్షణాలను కలిగి ఉంటుంది. కనుక సహజమైన రంగు పొడులను చల్లుకోవడం ద్వారా ఔషధంగా పని చేస్తాయని మన పూర్వీకుల నమ్మకం. కాబట్టి హోలీ పండుగ రోజున మోదుగ పూలతో కూడిన రంగులను ఉపయోగిస్తుంటారు. మనమంతా కూడా వాటినే ఉపయోగించే ప్రయత్నం చేయడం ఉత్తమం.