ఆసక్తి గలవారు ఏప్రిల్ 7వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలి
జనం న్యూస్ మార్చి 26
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ‘మాలిక్యులర్ డాకింగ్ అండ్ వర్చువల్ స్ర్కీనింగ్’పై ఒక రోజు ఆచరణాత్మక కార్యశాలను ఏప్రిల్ 11న నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేవారికి ప్రముఖ మాలిక్యులర్ మోడలింగ్ సాఫ్ట్ వేర్ అయిన మోల్ సాప్టును ఉపయోగించి కంప్యూటేషనల్ డ్రగ్ డిస్కవరీలో లోతైన అవగాహనను కల్పించడంతో పాటు ఆచరణాత్మక అనుభవాన్ని అందించడానికి రూపొందించినట్టు ఆయన తెలియజేశారు. మాలిక్యులర్ డాకింగ్ అండ్ వర్చువల్ స్ర్కీనింగ్ పరిచయం, డాకింగ్ మోడల్స్ యొక్క ఆఫ్టిమైజేషన్ అండ్ వాలిడేషన్, డ్రగ్ డిస్కవరీలో రియల్-వరల్డ్ కేస్ స్టడీస్ వంటి ముఖ్య అంశాలపై ఈ కార్యశాలలో తర్ఫీదు ఇస్తామన్నారు. పుణేలోని అడ్వెంట్ ఇన్ఫర్మేటిక్స్ లో అప్లికేషన్ సైంటిస్ట్ ఆదిత్య మిశ్రా ఈ కార్యశాలలో ప్రధాన శిక్షకుడిగా పాల్గొంటారని తెలిపారు. అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, కంప్యూటేషనల్ డ్రగ్ డిస్కవరీలో నిమగ్నమైన నిపుణుల కోసం దీనిని రూపొందించామని, కేవలం 30 మందికి మాత్రమే పాల్గొనే వీలుంటుందని ప్రిన్సిపాల్ స్పష్టీకరించారు. ఆసక్తి గలవారు ఏప్రిల్ 7వ తేదీలోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, రుసుము తదితర వివరాల కోసం డాక్టర్ ఎలగందుల సతీష్, 82394 77935, selagand@gitam.edu లేదా డాక్టర్ విన్యాస్ మాయాసా, 99491 23037, vmayasa@gitam.edu లను సంప్రదించాలని సూచించారు. ఓయూలో గీతం అధ్యాపకుడి పుస్తకావిష్కరణ గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జె.డి.ప్రభాకర్ పరిశోధనా పుస్తకం ‘భారతీయ భాషల సామాజిక-ఆర్థిక ఆకృతి’ని ఆవిష్కరించినట్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని భాషాశాస్త్ర విభాగం నిర్వహించిన ప్రతిష్టాత్మక 13వ అంతర్జాతీయ తెలుగు భాషాశాస్త్ర సదస్సులో, భారత భాషాశాస్త్ర పండితుల సంఘం పూర్వ అధ్యక్షుడు ప్రొఫెసర్ గారపాటి ఉమామహేశ్వరరావు, ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం, భారతీయ భాషల కేంద్ర సంస్థ అధ్యక్షుడు మాధభూషి సంపత్ కుమార్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినట్టు తెలియజేశారు. జర్మనీలోని ప్రఖ్యాత ప్రచురణల సంస్థ లింకం GmbH యూరోపా ప్రచురించిన ఈ పుస్తకం అంతర్జాతీయ గుర్తింపు పొందిందని, ఇటీవల హైడెల్ బర్గ్ విశ్వవిద్యాలయ గ్రంథాలయం, జర్మనీలోని పలు జాతీయ గ్రంథాలయాలో దీనిని ప్రతులను ఉంచినట్టు వివరించారు. భారతీయ భాషల సామాజిక-ఆర్థిక ప్రొఫైలింగ్, సామాజిక-ఆర్థిక అభివృద్ధిలో భాష పోషించే కీలక పాత్రను ఈ పుస్తకం అన్వేషిస్తుందన్నారు. లోతైన పరిశోధన, గణాంక విశ్లేషణ ద్వారా, ఆధునిక సమాజాలలో ఆర్థిక వృద్ధికి భాష ఎలా కీలకమైన చోదకంగా పనిచేస్తుందో రచయిత వివరించినట్టు తెలిపారు. ఆర్థిక కార్యకలాపాలు, సంపద ఉత్పత్తిని మెరుగుపరచడానికి స్థానిక భాషలను పారిశ్రామిక రంగాలలో అనుసంధానించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, భాష, ఆర్థిక వ్యవస్థల మధ్య లోతైన సంబంధాన్ని ఈ అధ్యయనం ప్రస్ఫుటీకరించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.