జనం న్యూస్ 28 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక:జిల్లాలో వివిధ గ్రామాలను సంబంధిత పోలీసు అధికారులు సందర్శించి, క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమవుతూ, వివిధ నేరాల నియంత్రణ పట్ల అవగాహన కల్పిస్తూ, గ్రామాల్లో పల్లె నిద్ర చేసి, వారి సమస్యలను పరిష్కరిస్తూ
ప్రజలకు మరింత చేరువ అవుతున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మార్చి 27న తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ - క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలను, శాంతిభద్రతల సమస్యలను గుర్తిస్తూ, వాటి పరిష్కారానికి సత్వరం చర్యలు చేపట్టేందుకు సంబంధిత పోలీసు అధికారులు, అడాప్షన్ కానిస్టేబుళ్ళు వారి పరిధిలోని గ్రామాల్లో నెలలో రెండు సార్లు పల్లె నిద్ర చేయాలని ఆదేశించామన్నారు. ఇందులో భాగంగా పార్టీలకు అతీతంగా గ్రామస్థులతో మమేకం కావాలని, గ్రామ సమస్యలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేసమస్యల గురించి వారితో చర్చించి, గ్రామాల్లో ఎటువంటి వివాదాలు, అల్లర్లు జరగక్కుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించి, ప్రజలకు పోలీసువ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంచాలన్నారు. గ్రామాల్లోకి వచ్చే కొత్త వ్యక్తులు, హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తుల నడవడికపై నిఘా పెట్టాలని, వారు జీవనం ఏవిధంగా సాగిస్తున్నది తెలుసుకోవాలన్నారు. గ్రామస్థాయిలో ఏ సమస్య ఉన్నా వెంటేనే పోలీసులకు, అడాప్షన్ కానిస్టేబుళ్ళుకు తెలిసే విధంగా సమాచార వ్యవస్థను నెలకొల్పాలని అధికారులకు, అడాప్షన్ కానిస్టేబుళ్ళుకు జిల్లా ఎస్పీ దిశా నిర్ధేశం చేసారు. గ్రామాల్లోని బాలికల పాఠశాలలు, హాస్టల్స్లో భద్రతను సంబంధితపోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.అదే విధంగా గ్రామస్థులతో మమేకమయ్యే సమయాల్లో వారికి ప్రస్తుతం ఏ తరహా నేరాలు జరుగుతున్నాయోవివరించి, వారిని అప్రమత్తం చేయాలన్నారు. ఏదైనా నేరానికి గురైనపుడు ఏవిధంగా వ్యవహరించాలి, పోలీసుల సహాయం ఏవిధంగా పొందాలన్న విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సైబరు మోసాలు జరుగుతున్నతీరును, నేరం జరిగినపుడు 1930కు ఫిర్యాదు చేయాలని, మహిళల రక్షణ, రహదారి భద్రత పట్ల అవగాహన కల్పించాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయం, అక్రమ రవాణకు పాల్పడడం వలన చట్ట ప్రకారం తీసుకొనేచర్యలను, అనర్థాలను 'సంకల్పం' ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించి, గంజాయి, మత్తు, మాదకద్రవ్యాల గురించిన సమాచారంను డయల్ 112/100, 1972 అందించాలని కోరుతున్నారు. మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన శక్తి మొబైల్ యాప్ గురించి అవగాహన కల్పించి, ఆపద సమయంలో ఎస్.ఓ.ఎస్. బటన్ప్రెస్ చేయడం వలన పోలీసుల సహాయం సులువుగా ఏవిధంగా పొందవచ్చునో గ్రామస్థులకు పోలీసు అధికారులు,సిబ్బంది వివరిస్తున్నారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.గత రెండు మాసాల్లో జిల్లాలో 10మంది సిఐలు, 30మంది ఎస్ఐలు 72 గ్రామాల్లో ఇప్పటి వరకు పల్లెనిద్ర చేసి,గ్రామస్థులతో మమేకం కావడం వలన మంచి ఫలితాలు వస్తున్నాయని, ప్రజల్లో పోలీసుశాఖ పట్ల నమ్మకం, విశ్వాసంపెరుగుతున్నదని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.