జనంన్యూస్. 28. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్,బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నేడు నగరంలోని ధర్నా చౌక్ లో నిర్వహించిన రైతు సత్యాగ్రహ దీక్షలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని చేసిన హామీలు ఎక్కడిపోయాయని ప్రశ్నించారు. పంటలకు నీరు లేక రైతులు కష్టాల్లో ఉన్నా ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.నిజాం సుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభంపై ప్రభుత్వం మౌనంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం అందించలేదని, ప్రభుత్వం నిర్వాకం వల్ల రైతులు కంట నీరు పెడతున్నారని మండిపడ్డారు.అకాల వర్షాలు, కరెంట్ కొరత కారణంగా పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని,ఎకరానికి రూ.30,000 నష్టపరిహారం రూ.2 లక్షల రుణమాఫీ రూ.15,000 రైతు భరోసా వరివరికో రూ.500 బోనస్ అందించాల్సిందిగా డిమాండ్ చేశారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుపై కాంగ్రెస్ నేతలు అసహనం చూపుతున్నారని, కానీ పసుపు రైతులకు ఇది ఎంతో ఉపయోగకరమని అన్నారు. గతంలో పసుపు రైతుల కోసం రోడ్డెక్కిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు మౌనంగా ఉండటం దురదృష్టకరమన్నారు. వరి కోతలు ప్రారంభమైనందున వెంటనే ఐకేపీ కేంద్రాలు ప్రారంభించి, సకాలంలో కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. బస్తాలు, లారీలు తదితర సదుపాయాలు సమకూర్చాలని అన్నారు.రైతుల కష్టాలను పట్టించుకోని ఈ ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసి, సమస్యలను పరిష్కరించాలి అని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో బీజేపీ ఇందూరు జిల్లా అధ్యక్షుడు, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు,రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు,ఈ మండల నాయకులు, కిసాన్ మోర్చా రాష్ట్ర, జిల్లా, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మరియు వివిధ మోర్చాల జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.