జనం న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా, మార్చ్ 29, (రిపోర్టర్ ప్రభాకర్):
తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్న ప్రతి కార్యకర్తను, నాయకులను అధిష్టానం గుర్తిస్తుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యాలయం నుంచి పాత బస్టాండ్ కు చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి వెళ్లి 13వ వార్డు ఇందిరా కాలనీ జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహానుభావులు ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ జెండాను భుజాలపై మోస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రతి కార్యకర్తకు నేను శిరసవంచి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. 43 సంవత్సరాలు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని అన్నారు. మన భారతదేశంలో ఒక ఉప్పెన, ఒక సంచలనం సృష్టించిన రాజకీయ పార్టీ ఏదైతే ఉందో అదే మనకు తెలుగుదేశం పార్టీ అని అన్నారు. అప్పట్లో రాష్ట్ర ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ మాటకు తిరుగులేదు అటువంటి వ్యక్తికి ఎదురెళ్లి నిలదీసిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు, అప్పట్లో తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, కాపాడి ఈరోజు మనం సగౌరవంగా నిలబడ్డామంటే అది అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులేనని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ చెక్కుచెదరకుండా ఉన్నదంటే అది నాయకులు, కార్యకర్తలు, అభిమానుల వల్లేనని అన్నారు. ప్రతి పేదవాడి ఆకలి తీరుస్తున్నది, వారి బాధలను అర్థం చేసుకున్నది, వారి కష్టసుఖాలు తెలుసుకొని పరిష్కరించేది కేవలం ఒక్క మన తెలుగుదేశం పార్టీ అని, దానికి పూర్తిస్థాయి బాధ్యత వహించేది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను నేను ఆదర్శంగా తీసుకొని నా ఊపిరి ఉన్నంతవరకు అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు, మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడుచుకుంటూ ప్రజాసేవకే అంకితం అవుతానని ఈ సభా వేదిక సాక్షిగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హామీ ఇస్తున్నానని అన్నారు.