జమ్మికుంట మాజీ జెడ్పిటిసి శ్రీరామ్ శ్యామ్..
జనం న్యూస్ // ఏప్రిల్ // 1 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మకానికి పెట్టడం అత్యంత దౌర్భాగ్య చర్య అని జమ్మికుంట మాజీ జడ్పిటిసి డాక్టర్.శ్రీరామ్ శ్యామ్ అన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర సాధనలో విశ్వవిద్యాయాలు క్రియాశీలక పాత్ర పోషించాయని వారు గుర్తు చేశారు. విశ్వవిద్యాలయ విద్యార్థుల పోరాటాల మూలంగానే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమైందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత యువతకు,నిరుద్యోగులకు ,ఉద్యోగాలు వస్తాయని ఎంతగానో ఆశించారని వారు గుర్తు చేశారు, కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములు, విశ్వవిద్యాలయ భూములను అమ్మి వాటిని సొమ్ము చేసుకుని ప్రజాపాలన చేయడం అత్యంత దౌర్భాగ్యమని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మడమే కాకుండా రాబోయే రోజులలో అన్ని జిల్లాల్లోని విశ్వవిద్యాల భూములను, ఇంటర్,డిగ్రీ కళాశాలకు చెందిన ప్రభుత్వ భూములు కూడా అమ్మడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెనకాడదని ఎద్దేవా చేసారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పాలన ప్రజా సమస్యలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపైన దృష్టి సారించాలని వారు గుర్తు చేశారు. యూనివర్సిటీ భూమిలో జోలికి పోతే ఎంత పెద్ద నాయకుడైనా భూస్థాపితం కావాల్సిందే ఆని హెచ్చరించారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం నూతన విద్యా విధానం పాలసీ అనుకుంటూనే, విద్యా వ్యవస్థను నాశనం చేయడానికి మరో పక్క ఆలోచిస్తున్నాడని అన్నారు. విశ్వవిద్యాలయాలలో బోధన, బోధనేతర సిబ్బంది నియమించకుండా విశ్వవిద్యాలయాల పైన రాష్ట్ర ప్రభుత్వం ముసలి కన్నీరు కారుస్తుందని మాట్లాడారు. విద్యార్థుల పైన లాటి చార్జ్ చేయడం, వారిపై కేసులు నమోదు చేయడం మూలంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్ప ప్రజల్లో మంచి పేరు రాదని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారంటీలో అమలు చేయలేక ప్రజల విశ్వాసం కోల్పోయారని మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను యూనివర్సిటీకే కేటాయించాలని,ఇ సందర్బంగా మాజీ జెడ్పిటిసి డాక్టర్.శ్రీరామ్ శ్యామ్ డిమాండ్ చేసారు.