ఛాట్లపల్లి మాజీ సర్పంచ్ నరేష్
జనం న్యూస్,ఏప్రిల్ 2 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్)
జగదేవపూర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు తమ పంటలు తామే కాల్చుకునే పరిస్థితి వచ్చిందని చాట్లపల్లి గ్రామ మాజీ సర్పంచ్ రాచర్ల నరేష్ అన్నారు. హామీల పేరుతో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, చిల్లర మాటలు మానుకోవాలని మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్, పై మాట్లాడే నైతిక హక్కు నీకు లేదని నరేష్ ఫైరయ్యారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో ఇంతవరకు రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేదని పైగా రైతు బంధు మింగిన రాబందు ముఖ్యమంత్రి రేవంత్ అని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథ నీరు రెండు అంతస్థుల వరకు నీటి సరఫరా అవుతే ఇప్పుడు ప్రజలకు సరిపడినన్ని నీటి సరఫరా కూడా జరగడం లేదని పైగా మిషన్ భగీరథ నీటి సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం కోత విధించిందని ఆరోపించారు. గత కేసీఆర్ పాలనలో గజ్వేల్ నియోజకవర్గాన్ని వేల కోట్ల నిధులతో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దారని
అన్నారు. గజ్వేల్ కి రైలు, రేక్ పాయింట్, అద్వితీయ మైన ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఎడ్యుకేషన్ హబ్, నాలుగు వరసల రోడ్లు, మహతి ఆడిటోరియం, ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి, పాండవుల
చెరువు, హార్టీకల్చర్ మరియు అగ్రికల్చరల్ యూనివ ర్శిటీ, గజ్వేల్ రింగురోడ్డు ఇలా చెప్పుకుంటూ పోతే వేల
కోట్లతో కేసీఆర్ గజ్వేల్ ని అభివృద్ధి చేశారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గజ్వేల్ లో
ప్రారంభించిన దాదాపు రూ.181 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను నిలుపుదల చేశారని ఆరోపించారు.
అధికారంలోకి వచ్చి 17 నెలల పాలనలో గజ్వేల్ లోఒక్కరూపాయి పని కూడా చేయలేదన్నారు. గత కేసీఆర్ పాలనలో మల్లన్నసాగర్ భునిర్వాసితులకు రూ.1260 కోట్ల రూపాయలను ఇచ్చామని, 90 శాతం వాళ్ల సమస్యలను పరిష్కరించామని అన్నారు. ఒక 5 నుంచి 10శాతం వరకు న్యాయం చేయాల్సి ఉందని అందుకు రూ.200 కోట్ల వరకు నిధులు విడుదల చేస్తే సరిపో తుందని అన్నారు. ఆనాడు మల్లన్నసాగర్ నిర్వాసితుల పక్షాన రేవంత్ రెడ్డి,చేసిన దీక్ష నాటకమా.. లేదా నిజమా అని ప్రశ్నించారు. నిజమైతే అధికారంలో ఉన్నది మీరే కాబట్టి ఎందుకు వారికి న్యాయం చేయలేక పోతున్నారని ప్రశ్నించారు. “హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ధర్నాలకు అనుమతించడం లేదు. పోలీసులు ఆశా కార్యకర్తలను సొమ్మసిల్లేలా కొట్టారు. గతంలో సర్వశిక్షా సిబ్బంది సమ్మెను సర్కార్ అణిచివేసింది. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చేతులెత్తేసింది. మాఫీ అయినవాళ్లు తక్కువ, కానివాళ్లే ఎక్కువ. రూ.2 లక్షలకు పైగా రుణం ఉన్న వారు పైడబ్బులు చెల్లిస్తే, మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం, ఆరునెలలైనా వారికి మాఫీ చేయడం లేదు. దేవుళ్లమీద ఒట్టుపెట్టి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతులను మోసం చేశారు. రాష్ట్రంలో అక్కాచెల్లెళ్లు, నిరుద్యోగులు, రైతులు ఆసరా పింఛనుదారులు దగాపడ్డారు. ఈ విషయమై అసెంబ్లీలో అడిగితే ప్రతిదాడులు చేస్తున్నారు తప్పితే సమాధానాలు ఇవ్వడం లేదు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా ఎత్తేశారు. రుణమాఫీ, రైతు భరోసాపై రైతులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి” అని చెప్పారు, "వానాకాలం రైతుభరోసా ఎగ్గొట్టారు. యాసంగికి ఊరించి, ఊరించి వేస్తున్నారు. బడా కాంట్రాక్టర్లకు మాత్రం రూ.14 వేల కోట్ల బిల్లులు ఇచ్చారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు డబ్బులివ్వమంటే ఉండవు! 25వ తేదీ వచ్చినా అంగన్వాడీ సిబ్బందికి జీతాలు ఇవ్వలేదు. బ్బుల్లేవంటున్న ప్రభుత్వం… రూ.20 వేల కోట్లతో హెచ్ఎండీఏలో, రూ.15 వేల కోట్లతో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, రూ.7 వేల కోట్లతో జీహెచ్ఎంసీలో టెండర్లు ఎలా పిలుస్తోంది? ప్యూచర్ సిటీ పేరు మీద సీఎం అత్తగారి గ్రామమైన ఆమనగల్లుకు రూ.5వేల కోట్లతో 10 లేన్ల రోడ్డు ఎలా వేస్తున్నారు సంపూర్ణ రుణమాఫీ అయ్యేదాకా కాంగ్రెస్ వెంట పడతాం. రైతుల పక్షాన నిలదీస్తూనే ఉంటాం” అని నరేష్ స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు కావస్తున్నా ఇంకా బిల్లులు చెల్లించకపోవడం తాజా మాజీ సర్పంచులను త్రివ మనోవేదనకు గురి చేస్తున్నాయని అన్నారు. పెండింగులు ఉన్న బిల్లులు 2019 నుంచి 2024 వరకు గ్రామాల అభివృద్ధి కోసం చేసిన పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. పెండింగ్ బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని విడుదల చేయడం లేదని, తాము పెట్టిన డబ్బు రాక ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామాల్లో గత ప్రభుత్వ ఆదేశానుసారం వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలు, రైతు వేదికలు, డంపింగ్ యార్డ్లు, సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాల్వలు, వీధిలైట్ల నిర్వహణ, పారిశుధ్యం, క్రీడా ప్రాంగణాల ఏర్పాటు తదితర పనులు చేపట్టడం జరిగిందని వివరించారు. ఆయా పనులకు ప్రభుత్వం నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో అప్పటి సర్పంచ్లు లక్షల రూపాయలు అప్పులు చేసి పనులు పూర్తి చేశారని పేర్కొన్నారు. గ్రామాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన గత, ప్రస్తుత ప్రభుత్వం బిల్లుల చెల్లింపులో జాప్యం చేయడం సరికాదని పేర్కొన్నారు.
పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనుల బిల్లులను తక్షణమే మంజూరు చేసే విధంగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.