కోనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పన
టోకేన్ పద్దతి ప్రకారం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకుని రావాలి
ధాన్యం తరలింపు కేటాయించిన రైస్ మిల్లులకు మాత్రమే జరగాలి
24 గంటల ధాన్యం తరలింపు జరిగేలా వాహనాలను ఏర్పాటు చేసుకోవాలి
ధాన్యం కొనుగోలు పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్
జనం న్యూస్, ఏప్రిల్ 03, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి :
యాసంగి మార్కెటింగ్ సీజన్ లో పెద్దపల్లి జిల్లాలో రైతులు పండించిన ధాన్యం మద్దతు ధర పై కొనుగోలు చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు తో కలిసి ధాన్యం కొనుగోలు పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ధాన్యం తరలింపు సమయంలో కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీ సమస్యలు రాకుండా ముందస్తుగా ప్లానింగ్ చేసుకోవాలని కలెక్టర్ అధికారులు ఆదేశించారు. కోనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని నిర్వాహకులు గుర్తించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాలకు అలాట్ చేసిన రైస్ మిల్లులకు మాత్రమే ధాన్యం తరలించాలని కలెక్టర్ సూచించారు. గత ఖరీఫ్ సీజన్ లో పెద్దపల్లి జిల్లాలో విజయవంతంగా ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు . గత సీజన్ లో ధాన్యం రవాణా అంశంలో ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే వాటిని పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్ తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేసేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జి , సిబ్బందికి అవసరమైన శిక్షణ అందజేయాలని కలెక్టర్ సూచించారు.ధాన్యం నాణ్యత ప్రమాణాలు పై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. గ్రేడే ఏ రకం ధాన్యానికి క్వింటాల్ 2320 రూపాయల, సాధారణ రకం ధాన్యానికి క్వింటాల్ 2300 రూపాయలు ఉంటుందని అన్నారు.జిల్లాలో వరి పంట కోతల ప్రకారం కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకుని వచ్చే షెడ్యూల్ పకడ్బందీగా తయారు చేయాలని, కొనుగోలు లో ఎక్కడ ఒత్తిడి లేకుండా క్రమ పద్ధతిలో ధాన్యం తీసుకుని వచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. గతం కంటే ఈసారి అధికంగా ధాన్యం దిగుబడి వస్తుందని, 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అంచనా ఉందని అన్నారు. కోనుగోలు కేంద్రాలకు వచ్చిన 24 గంటలలో ధాన్యం తరలింపు జరిగేలా అవసరమైన వాహనాలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు.సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ప్రకటించిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలకు అధికంగా వచ్చే అవకాశం ఉందనే అంచనా తో అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు గ్రామాల వారీగా సన్న రకం ధాన్యం ధ్రువీకరణ చేసి కొనుగోలు కేంద్రం మ్యాపింగ్ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.జిల్లా సరిహద్దుల్లో అవసరమైన చెక్ పోస్టుల ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుంచి మనకు సన్న రకం వడ్లు రాకుండా చూడాలని అన్నారు. దాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, ప్యాడీ క్లీనర్, వేయింగ్ యంత్రాలు, తేమ యంత్రాలు , మొదలగు వసతులు కల్పించాలని అన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో త్రాగు నీరు, విద్యుత్ సరఫరా, లైట్లు మొదలగు సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వేసవి దృష్ట్యా త్రాగునీటి సరఫరా ప్రత్యేక దృష్టి సారించాలని, చల్లని త్రాగు నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, అవసరమైన మేర ఓఆర్ఎస్ ప్యాకేట్లు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాల నుంచి పంట కాపాడేందుకు వీలుగా టార్ఫాలిన కవర్లు అందుబాటులో పెట్టుకోవాలని అన్నారు. కొనుగోలు కేంద్రాలకు ముందు వచ్చిన రైతులకు ముందుగానే కాంటా పెట్టాలని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఎక్కడ కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు జరగాలని అన్నారు. ప్రభుత్వం నుంచి రైస్ మిల్లులకు ఎటువంటి పెండింగ్ అంశాలు లేకుండా సాధించే దిశగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఐకేపి కేంద్రాల్లో ఎక్కడా కోతలు లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. రైతులు ధాన్యం విక్రయించిన 48 గంటల లోగా డబ్బులు పడాలని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాలిందిని , డి.సి.ఓ. శ్రీ మాల సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.