జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 7 రిపోర్టర్ సలికినీడి నాగరాజ
శాశ్వత అధికారమనే అహంకారంతో వైసీపీనేతలు యథేచ్ఛగా అవినీతి, భూ కబ్జాలు చేశారు : ప్రత్తిపాటి.
సెంటు పట్టాలు, డ్వాక్రారుణాల స్వాహా, భూ ఆక్రమణల్లో మాజీమంత్రి, ఆమె కుటుంబ పాత్ర, ప్రమేయంపై సమగ్ర విచారణ జరపాలి : పుల్లారావు
అధికారులు ప్రజలకు న్యాయం చేస్తే, మాజీమంత్రి బాగోతాల్లో మిగిలిన 99శాతం కూడా రాష్ట్రానికి తెలుస్తాయి : పుల్లారావు
ప్రజలిచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో వేగంతో పాటు నాణ్యతకు ప్రాధాన్యమివ్వండి : ఎంపీ కృష్ణదేవరాయలు గత ప్రభుత్వంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో అవినీతి మంత్రి ఆధ్వర్యంలో జరిగిన అవినీతి, అరాచకాలు, దుర్మార్గాలు, భూ కబ్జాల నుంచే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని, అధికారంతో ఏమైనా చేయొచ్చనే అహంకారంతో విర్రవీగిన వైసీపీప్రభుత్వ దారుణపాలన ప్రభావం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్ లో సోమవారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఆయనతోపాటు ఎంపీ లావు కృష్ణదేవరాయలు, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, జేసీ సూరజ్ ధనుంజయ్, ఆర్.డి.వో మధులత, డి.ఆర్.వో మురళి మరియు జిల్లా ప్రధాన అధికార యంత్రాంగం హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. శాశ్వత అధికారమనే అహంకారంతో దారుణాలకు పాల్పడ్డారు శాశ్వతంగా తామే అధికారంలో ఉంటామన్న అహంకారంతో వైసీపీనేతలు అనేక దారుణాలకు పాల్పడ్డారని, కూటమిప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతుందున్న నమ్మకంతో వైసీపీ బాధితులు తమసమస్యల్ని బయటకు చెప్పుకుంటున్నారని ప్రత్తిపాటి చెప్పారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ బాధితుల్లో కేవలం శాతమే బయటకు వచ్చారని, ఇంకా 99 శాతం రావాల్సి ఉందన్నారు. జిల్లా కలెక్టర్, ఇతర ప్రధానాధికారులు బాధ్యత తీసుకొని ప్రజల సమస్యలు పరిష్కరిస్తేనే ప్రభుత్వంపై జనాలకు నమ్మకం, విశ్వాసం కలుగుతాయని, అప్పుడే మిగిలిన వారు కూడా తమసమస్యల్ని బహిర్గతపరుస్తారని ప్రత్తిపాటి చెప్పారు. చిలకలూరిపేట నుంచి ప్రాతినిధ్యం వహించిన అవినీతిమంత్రి అనుచరులు చాలామంది ఇప్పటికే భయంతో రాష్ట్రాలు దాటి పారిపోయారని ప్రత్తిపాటి తెలిపారు. ప్రజలకు అన్యాయంచేసిన అలాంటివారిని శిక్షిస్తేనే ప్రభుత్వంపై సదభిప్రాయం ఏర్పడుతుందన్నారు.
మాజీమంత్రి, ఆమె కుటుంబసభ్యుల అవినీతి, మోసాల వల్లే ప్రజలకు బాధలు
మాజీమంత్రి మామ ప్రజలకు ఉపయోగపడే రోడ్డు తనదని నమ్మించి, తిరిగి తానే జనానికి రాసిచ్చినట్టు నాటకమాడితే, ఆయన కొడుకేమో ఆ రోడ్డు తమదేనంటూ న్యాయస్థానాల్లో స్టే తీసుకొస్తాడని ప్రత్తిపాటి ఎద్దేవాచేశారు. ఎవరి వాదన నిజమో తెలియాలంటే ఇలాంటప్పుడు ప్రజల సాక్షిగా అధికారుల ముందుకు రావాలని, అప్పుడే నిజానిజాలు బయటపడతాయని ప్రత్తిపాటి చెప్పారు. పసుమర్రు గ్రామస్తులు రోడ్డు ఆక్రమణపై కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదే అందుకు నిదర్శనమని, ఆ రోడ్డు కథేంటో తేల్చి గ్రామస్తులకు న్యాయం చేయాలని ప్రత్తిపాటి సభాముఖంగా కలెక్టర్ ను కోరారు. అదేవిధంగా సెంటు పట్టాల పేరుతో జరిగిన భూసేకరణలోని లొసుగుల్ని కూడా బయటపెట్టి ఆ ఊరి రైతులకు న్యాయం చేయాలన్నారు.. ఏ సమస్య మూలాల్లోకి వెళ్లినా ఎక్కడో ఒకచోట మాజీమంత్రి, ఆమె కుటుంబ పాత్ర, ప్రమేయం ఉంటుందని, దాని ప్రభావమే నేటికీ ప్రజలు పడుతున్న బాధలని ప్రత్తిపాటి తెలిపారు. డ్వాక్రా మహిళలు బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాల్ని కాజేసిన వ్యవహారంపై కూడా విచారణ జరిపించి, అసలు దొంగలెవరో కనిపెట్టి కఠినంగా శిక్షించాలని ప్రత్తిపాటి కలెక్టర్ని ఆదేశించారు. నియోజకవర్గవ్యాప్తంగా రూ.4 కోట్లవరకు కాజేసినట్టు ఫిర్యాదులు వస్తున్నాయని, సమస్యపై పోలీస్ యంత్రాంగం దృష్టి పెట్టాలన్నారు. ఈ విధంగా అందిన చోటల్లా అడ్డగోలుగా అరాచకాలు చేయబట్టే అడ్రస్ లేకుండా పోయారన్నారు సమస్యల పరిష్కారం..అధికారులు బాధ్యతగా భావించాలి
ప్రజలు ఫిర్యాదులు ఇచ్చారు…తీసుకున్నాం..మన పని అయిపోయింది అన్నట్టు కాకుండా అధికార యంత్రాంగం బాధ్యతతో పనిచేసి, ప్రజలకు న్యాయం చేయాలని ప్రత్తిపాటి సూచించారు. గత ప్రభుత్వంలో మాదిరి ఏకపక్షంగా ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేయకుండా, న్యాయం ఎవరిది.. తప్పు ఎవరు చేశారు..అసలు సమస్య ఎక్కడ ప్రారంభమైందో ఆలోచించి బాధితులకు న్యాయం చేయాలని మాజీమంత్రి సూచించారు. ఒకసారి తమదృష్టికి వచ్చిన సమస్య, తిరిగితిరిగి మరుగున పడిపోకూడదని, అలానే మరొకరి దృష్టికి వెళ్లకుండా, చట్టబద్ధంగా దాన్ని పరిష్కరించాలన్నారు. కోర్టువివాదాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సింది కచ్చింగా చేస్తే, ఏ సమస్య అయినా త్వరితగతిన పరిష్కారమవుతుందని ప్రత్తిపాటి తెలిపారు. పల్నాడు జిల్లాకు మంచి కలెక్టర్ వచ్చారు ముఖ్యమంత్రి పల్నాడు జిల్లాకు మంచి కలెక్టర్ని నియమించారని, ఆయన ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం నిబద్ధతతో పనిచేయాలని ప్రత్తిపాటి సూచించారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే సమస్యలపై వేగంగా స్పందిస్తున్నారన్నారు. అధికారులంతా ఐక్యంగా పనిచేస్తే ప్రజల్లో వారికి మంచి గుర్తింపు లభిస్తుందని, తద్వారా ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుందని పుల్లారావు స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో వేగంతో పాటు నాణ్యత కూడా ఉండాలి ఎంపీ లావు కృష్ణ దేవరాయలు. నియోజకవర్గాల వారీగా ప్రజావేదిక నిర్వహించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని, ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చే సమస్యల్ని అధికారులు వేగంగా పరిష్కరించి వారికి న్యాయం చేయాలని నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు సూచించారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 14,598 ఫిర్యాదుల ప్రజల నుంచి వచ్చాయని, వాటిలో ఎక్కువగా రెవెన్యూ సమస్యలే ఉన్నాయని ఎంపీ తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారంలో వేగంతో పాటు నాణ్యత కూడా సక్రమంగా ఉండాలని, రెవెన్యూ .. భూ వివాదాలకు సంబంధించి వివిధ కాగితాలు కావాలని ప్రజల్ని కార్యాలయాల చుట్టూ తిప్పడం సరైన పద్ధతి కాదని ఎంపీ స్పష్టంచేశారు ముఖ్యంగా భూ వివాదాల పరిష్కారంలో అధికారులు లోతైన దర్యాప్తు చేయాలని, భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పరిష్కారమార్గాలు సూచించాలని ఎంపీ ఆదేశించారు. 2, 3నెలల్లో ప్రజలకు పూర్తి న్యాయం జరిగేలా అధికార యంత్రాంగం సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఎంపీ సూచించారు. అర్జీదారుతో మాట్లాడితేనే సమస్య తీవ్రత తెలుస్తుంది : కలెక్టర్ అరుణ్ బాబు చిలకలూరిపేట నియోజకవర్గవ్యాప్తంగా నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో 300ల అర్జీలు వస్తే, వాటిలో 150కు పైగా రెవెన్యూ (భూసమస్యలు) ఫిర్యాదులే ఉన్నాయని పల్నాడుజిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. వాటిలో ఎక్కువగా సర్వే ఫిర్యాదులే ఉన్నాయన్నారు. భూ వివాదాల పరిష్కారంలో తాను అధికారులకు మొదటినుంచీ ఒకటే చెబుతున్నానన్న కలెక్టర్, తమ దృష్టికి అర్జీ వచ్చినప్పుడు ఏ అధికారి అయినా అర్జీదారుతో మాట్లాడి,వారు చెప్పేది వినాలని, అప్పుడే సమస్య తీవ్రత తెలుసుందన్నారు. ప్రత్తిపాటి పుల్లారావుకి సమస్యలపై మంచి అవగాహన ఉందని, ఆయన అనుభవం సమస్యల పరిష్కారానికి ఎంతగానో ఉపయోగపడుతుందనే వాస్తవాన్ని అధికారులు గమనించాలని కలెక్టర్ తెలిపారు.