ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి విశేష కృషి..
నివాళులు అర్పించిన పోలాడి రామారావు..
జనం న్యూస్ // ఏప్రిల్ // 9 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
రాజకీయాలకు కొత్త ఒరవడి నేర్పి, ప్రజా జీవితంలో డైనమిక్ గా వెలుగొందిన మాజీ మంత్రి స్వర్గీయ ముద్దసాని దామోదర్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు, ముద్దసాని ప్రియ శిష్యుడు పోలాడి రామారావు కొనియాడారు.
పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటూ,అర్ధ రాత్రి వరకు సామాన్య ప్రజలతో మమేకమై వారి సమస్యలు పరిష్కరానికి కృషి చేసిన అరుదైన ఘనత దామోదర్ రెడ్డికే దక్కుతుందన్నారు.
దామోదర్ రెడ్డి 13 వ వర్ధంతి సందర్భంగా..నగరంలో సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకుల తో కలిసి రామారావు ఘనంగా నివాళులు అర్పించారు.అప్పటి కమలాపూర్ నియోజకవర్గం , ఇప్పటి హుజురాబాద్ నుండి తెలుగుదేశం పార్టీ తరపున శాసనసభ్యుడిగా నాలుగుసార్లు వరుసగా గెలుపొంది దామోదర్ రెడ్డి చరిత్ర సృష్టించారని చెప్పారు.నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారక రామారావుల మంత్రివర్గంలో యువజన వ్యవహారాలు, పర్యాటక, రవాణా,సాంకేతిక శాఖల మంత్రిగా 3 సార్లు సమర్థవంతంగా విధులు నిర్వహించారని తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జిగా కూడా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు.1985లో తొలిసారి టిడిపి నుండి పోటిచేసి కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్రారెడ్డిపై విజయం సాధించిన దామోదర్ రెడ్డి ఆ తర్వాత రాజకీయాలలో వెనుతిరిగి చూసుకోలేదని చెప్పారు.1989,1994,1999 ఎన్నికలలో వరుస విజయాలు సాధించిన ఆయన 2004 ఎన్నికల్లో పరాజయం చవిచూసారని తెలిపారు. అయినప్పటికీ ఆయన కాలం చెల్లే వరకు ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటం చేసే వారని అన్నారు. ఉమ్మడి జిల్లా మంత్రిగా జిల్లా అభివృద్ధికి ముఖ్యంగా రైతాంగ సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషి మరువలేనిది అన్నారు. దామోదర్ రెడ్డి హయాంలో నియోజకవర్గ వ్యాప్తంగా కాకతీయ కాలువ పరిధిలోని ఉప కాలువలు, డిస్ట్రిబ్యూటర్ లకు లైనింగ్ నిర్మాణ పనులను చేయించి కాలువల వెంట ఉన్న ఆయకట్టు గ్రామాలకు మానకొండూర్, శంకరపట్నం, వీణవంక, హుజురాబాద్, జమ్మికుంట, కమలాపూర్ మండలాల పరిధిలోని అన్ని గ్రామాలకు బీ టీ రోడ్లు నిర్మాణం చేయడం జరిగిందని చివరి ఆయకట్టు రైతులకు నీళ్ళు అందే విధంగా దామోదర్ రెడ్డి కాలువల వెంట నిరంతర పర్యవేక్షణ చేసి రైతు బాందవుడిగా పేరు తెచ్చుకున్నారని అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించి రైతులకు అందించిన విశేష సేవలు మరువలేనివి పోలాడి రామారావు నివాళులు అర్పించారు. ఆయన గతంలో మే 12 న 2000 సం లో. నా ప్రత్యేక విజ్ఞప్తి మేరకు ముద్దసాని అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని మా స్వగ్రామమైన మాన కొండూర్ మండల పరిధిలోని మా వన్నారం గ్రామానికి రప్పించి చంద్రబాబు పర్యటన ఏర్పాటు చేశారని ఆ సభలో మా విజ్ఞప్తి మేరకు గట్టుదుద్దెన పల్లి హైవే నుంచి శెంశాబాద్, మా వన్నారం గ్రామం నుంచి ఎరడపల్లి, అర్కండ్ల, గంగారం, ఎలబాక, చల్లూర్ వరకు 14 కి. మీ. పక్కా బీ టీ రోడ్డు నిర్మాణమునకు చంద్రబాబు తో మంజూరు చేయించి దామోదర్ రెడ్డి పూర్తి చేయించారని దీంతో మానకొండూర్, శంకరపట్నం, వీణవంక, జమ్మికుంట, హుజురాబాద్ మండలాల పరిధిలోని రైతులకు ఎంతో మేలు చేకూరిందని పోలాడి రామారావు తెలిపారు. అధికారం లో ఉన్న, ప్రతిపక్షం లో ఉన్నా ఉమ్మడి జిల్లా ప్రజలకు, రైతులకు, సామాన్యుల సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేసిన దామోదర్ రెడ్డి లాంటి నాయకులు నేడు అరుదు అని కొనియాడారు.