జనం న్యూస్: సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి వై.రమేష్:9 ఏప్రిల్ బుధవారం:
జర్నలిజం, విద్యా రంగాల్లో అక్షరాల ఘనతను చాటుతూ, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన ఉత్తములకు గౌరవాన్ని అందించే ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం ఈ ఏడాది భిన్నంగా నిలవనుంది. అక్షర యోధులుగా వెలుగొందుతున్న 100 మంది తెలుగు జర్నలిస్టులకు పురస్కారాలు ఇవ్వబోతుండగా, విద్యా రంగంలో అపూర్వ సేవలందించిన సిద్దిపేట జిల్లాకు చెందిన ఎజాజ్ అహ్మద్ “ఉగాది పురస్కారం”ను త్వరలో అందుకోబోతున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం, విజయవాడలో జరగబోయే కార్యక్రమంలో భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ ముఖ్య అతిథిగా హాజరై, తన స్వహస్తాలతో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. విద్యా రంగానికి విశిష్ట సేవలందించిన ఉపాధ్యాయులను గుర్తించి, వారి కృషికి న్యాయమైన గుర్తింపు ఇచ్చే ఈ వేదిక మరింత స్ఫూర్తిదాయకంగా మారనుంది. ఎజాజ్ సార్ అనేక వేల మంది విద్యార్థులకు హ్యాండ్ రైటింగ్ శిక్షణ అందిస్తూ, "అక్షరాలు జీవితాన్ని మార్చగలవు" అన్న నమ్మకంతో పని చేస్తున్నారు. విద్యార్థుల్లో అక్షరాలపై మక్కువ కలిగించడం, వారి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయడంలో ఆయన పాత్ర అపారమైంది. ఆయన నైపుణ్యం, నిబద్ధత, సేవాభావం ఈ గౌరవానికి అర్హత చాటుతుంది. ఈ పురస్కారం ఆయన్ని మరింత ప్రేరేపిస్తుందనే నమ్మకంతో, మన గురువైన ఎజాజ్ సార్ కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఆయనకు మరెన్నో విజయాలు లభించాలని కోరుకుంటున్నాం.