జనం న్యూస్,ఏప్రిల్09, జూలూరుపాడు: మండల పరిధిలోని వినోబా నగర్ గ్రామంలో మొక్కజొన్న పంట సాగు చేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని,మొక్కజొన్న విత్తనాల కంపెనీ యాజమాన్యంపై మరియు ఏజెంట్ల పైన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జాటోత్ కృష్ణ డిమాండ్ చేశారు.రైతులతో కలిసి స్థానిక సొసైటీ కార్యాలయం వద్ద సొసైటీ చైర్మన్ సమక్షంలో మండల వ్యవసాయ అధికారి కి వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో అనేక మంది రైతులు వివిధ కంపెనీలకు చెందిన ఆడ మగ మొక్కజొన్న పంటలను సాగు చేశారని, విత్తనాలు వేసే సమయంలో కంపెనీలు ఏజెంట్లు రైతులకు మాయమాటలు చెప్పి మేమే పంటను కొనుగోలు చేస్తామని హామీలు ఇచ్చి నేడు పంట దిగుబడి సరిగా రాలేదని సాకుతో మొక్కజొన్న పంటను ఇరిపించకుండా కంపెనీలు ఏజెంట్లు పట్టించుకోకుండా తిరుగుతున్నారని దీంతో పంటను సాగు చేస్తున్న రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. భారతి, రక్ష్యం కంపెనీలకు చెందిన విత్తనాలను హిమామ్ నగర్ చెందిన ఒక ఏజెంట్ ద్వారా రైతులు సాగు చేశారని ఆంద్రా నుంచి వచ్చిన డీలర్లు రైతులకు నకిలీ విత్తనాలను అంట గట్టి కనిపించకుండా పోయారని, హిమామ్ నగర్ కు చెందిన ఏజెంట్ కూడా పట్టి పట్టనట్లుగా వ్యవరిస్తున్నాడని రైతులు ఎన్నోసార్లు సంప్రదించిన మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండని మొండిగా మాట్లాడుతున్నాడని, ఏజెంట్ పైన డీలర్ల పైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా పంట నష్టపోయిన రైతులను వ్యవసాయ రెవెన్యూ అధికారులు సర్వే చేసి రైతులకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం చెల్లించాలని కృష్ణ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు గోపాలరావు బానోత్ ధర్మ, భూక్య బాలు, గంగావతి లక్ష్మణ్, భూక్య వస్రాం,బానోతు బాలు, ధరంసోత్ హనుమంతు, బానోతు వెంకటేష్, గంగావత రమేష్, మోతిరామ్, గంగావతి ప్రసాద్,మాలోత్ ప్రశాంత్,రైతులు పాల్గొన్నారు.