రాష్ట్ర హెూం మరియు విపత్తుల నిర్వహణ శాఖామాత్యులు వంగలపూడి అనిత
జనం న్యూస్ 10 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం, శ్రీకాకుళం మరియు పార్వతీపురం మన్యం జిల్లాల పోలీసు అధికారులతో రాష్ట్ర హెూం మరియు విపత్తుల నిర్వహణ శాఖామాత్యుల వంగలపూడి అనిత శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏప్రిల్ 9న సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయానికి విచ్చేసిన మంత్రివర్యులకు విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి, జిల్లా ఎస్పీలు కే.వి.మహేశ్వరరెడ్డి, వకుల్ జిందల్ మరియు ఇతర పోలీసు అధికారులు స్వాగతం పలికి, పూల మొక్కలను అందజేసారు. పోలీసు సిబ్బంది నుండి రాష్ట్ర మంత్రివర్యులు గౌరవ వందనం స్వీకరించగా, తప్పెడ గుళ్ళుతో జానపద కళా బృందం మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర హెూం మరియు విపత్తుల నిర్వహణ మంత్రివర్యులు వంగలపూడి అనిత మాట్లాడుతూ - మహిళలు, బాలికల భద్రత, రక్షణకు తొలి ప్రాధాన్యతను కల్పించాలని, మైనరు బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు, క్షేత్ర స్థాయిలో కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోలీసుశాఖ ప్రతిష్టను పెంచేలా పోలీసు అధికారులు విధులు నిర్వహించాలన్నారు. పోలీసు స్టేషనుకు వచ్చే బాధితులకు న్యాయం చేయాలని, వారి పట్ల సానుకూలంగా వ్యవహరిస్తూ, మర్యాదగా ప్రవర్తించాలన్నారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు దశల వారీగా అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. పోలీసు వాహనాలు,
ఫింగర్ ప్రింట్ పరికరాలు, సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను అందించి, నేర నియంత్రణలో సాంకేతికతను మరింత విస్తృతంగా వినియోగిస్తామన్నారు. నిందితులు శిక్షింపబడే విధంగా కేసులను దర్యాప్తు చేపట్టాలని, మంచి పోలీసింగుతో నేరస్థులు భయపడే విధంగా పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో డ్రాప్ బాక్సులు ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు శక్తి బృందాలు ద్వారా సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. స్కూల్స్ నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించాలని, నేరంకు పాల్పడితే ఎటువంటి శిక్షలు విధిస్తారన్న విషయం అర్ధమయ్యే రీతిలో వారికి అధికారులు వివరించాలన్నారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక ఒక సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం కలిగిన సిబ్బందిని
నియమించి, సైబరు నేరాలను నియంత్రించాలని, కేసులను చేధించాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు వద్ద నిరంతరం వాహన తనిఖీలు చేపట్టాలని, గంజాయి, మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా అరికట్టేందుకు వటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యాలయాలు, గృహ సముదాయాలు, గ్రామీణ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. త్వరలో అంతరాష్ట్ర పోలీసులతో కో-ఆర్డినేషను సమావేశం నిర్వహిస్తామని, నేరాల నియంత్రణకు కఠిన చర్యలు చేపడతామన్నారు. మైనరు బాలికలపై అఘాయిత్యాలు జరుగుటకు కారణాలను అన్వేషించాలని, ఆయా నేరాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను రాష్ట్ర హెూం మరియు విపత్తుల నిర్వహణ మంత్రివర్యులు వంగలపూడి అనిత అధికారులను కోరారు. విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి మాట్లాడుతూ - రేంజ్ పరిధిలో నేర నియంత్రణ చర్యల్లో భాగంగా గత 10మాసాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత అంశాలలో మహిళలు, బాలికలు సంబంధించిన నేరాలు, గంజాయి నిర్మూలన, రోడ్డు ప్రమాదాలు నివారణ, సైబర్ కేసులు నమోదు, నేరగాళ్లు నేర ప్రవృత్తి గురించి క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తూ, నేరాలు అరికట్టేందుకు జిల్లా ఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది కష్టపడి పని చేస్తున్నారన్నారు. గంజాయి సాగును నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించామని, గంజాయి సాగు చేసే వారిపై కేసులు నమోదు చేసామని రేంజ్ పరిధిలో చేపట్టిన నియంత్రణ చర్యలను రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి రాష్ట్ర మంత్రివర్యులకు వివరించారు.
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ - గంజాయి నేరాల్లో సంబంధం ఉన్న నిందితులందరినీ అరెస్టు చేసామన్నారు. మహిళలపై జరిగే నేరాల్లో 60రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి, న్యాయ స్థానాల్లో అభియోగ పత్రాలను దాఖలు చేస్తున్నామన్నారు. పోక్సో కేసుల్లో నిందితులు శిక్షింపబడే విధంగా ప్రత్యేకంగా చర్యలు చేపట్టిన ఫలితంగా ఇటీవల కాలంలో 23 కేసుల్లో నిందితులు శిక్షింపబడ్డారన్నారు. వాటిలో మూడు కేసుల్లో 25సం.లు కఠిన కారాగారం విధించబడగా, 9 కేసుల్లో 20సం.లు కారాగార శిక్షలు, రెండు కేసుల్లో 7 సం.లు కంటే ఎక్కువ జైలు, 9 కేసుల్లో 3సం. లు కంటే ఎక్కువ జైలు శిక్షలు విధించారన్నారు. జిల్లాలో 5 శక్తి టీమ్స్ ను నియమించామని, నేరాల నియంత్రణకు 3000 సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని లక్ష్యం చేసుకొని, ప్రస్తుతం ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో 2125 సిసి కెమెరాలను ఏర్పాటు చేసామన్నారు. జిల్లా పోలీసుశాఖ చేపడుతున్న చర్యల ఫలితంగా గంజాయి అక్రమ రవాణదారులపై ఉక్కుపాదం మోపామని, 10చోట్ల ప్రతీ రోజూ డైనమిక్ వాహన తనిఖీలు చేపడుతున్నామని, వివిధ నేరాలకు పాల్పడిన వారిపై 363 హిస్టరీ షీట్లును క్రొత్తగా తెరిచి, వారి కదలికలపై నిఘా పెట్టామని రాష్ట్ర హెూంమంత్రికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ వివరించారు. ఈ సమీక్ష సమావేశంలో రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి, విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి, పార్వతీపురం మన్యం జిల్లా ఏఎస్పీ అంకిత సురాన, విజయనగరం అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, శ్రీకాకుళం అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు, డీఎస్పీలు సి.హెచ్. వివేకానంద, వివి అప్పారావు, అప్పారావు, శేషాద్రి, రాంబాబు, భవ్య రెడ్డి, రాఘవులు, శ్రీనివాసరావు, పలువురు సిఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.