జనం న్యూస్ 10 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా
జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ : జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ సమావేశం హాల్ నందు వరి ధాన్యం కొనుగోలు శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2024-2025 యాసంగి సీజన్ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా, సజావుగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్యాడీ క్లీనర్లు,తూకం యంత్రాలు, తేమ కొలిచే యంత్రాలు, అవసరమైన గన్ని సంచులు, టార్పాలిన్ కవర్లు ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద త్రాగునీరు, ఓ.ఆర్.ఎస్ పాకెట్లతో ఏర్పాటు చేయాలన్నారు. తేమ శాతం నిబంధనల కంటే తక్కువగా వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు చేసి, ఆలస్యం చేయకుండా కేంద్రాల్లో నిల్వగా ఉంచే పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఓ.పి.ఎం.ఎస్‌లో ఖచ్చితంగా నమోదు చేయాలని,ప్రతి దశలో ఫిజికల్ వివరాలు, ఆన్లైన్ డేటా ఒకేలా ఉండేలా చూసుకోవాలని, నివేదికలు పూర్తిగా సరైనవిగా, స్పష్టంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు తేమ శాతాన్ని చెక్ చేయడంతో పాటు, తాలు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులకు సన్న రకాల ధాన్యానికి క్వింటాలుకు రూ.2320 మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ కలిపి రూ.2820 చెల్లింపును స్పష్టంగా చూపించేలా చార్ట్‌ను రూపొందించి ప్రతి కొనుగోలు కేంద్రంలో ప్రదర్శించాల్సిందిగా అధికారులకు సూచించారు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వడంతో పాటు, ప్రాసెస్ చేసిన సన్న బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తోందని తెలిపారు.అంతర్ రాష్ట్ర బోర్డర్స్ వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి,పక్క రాష్ట్రాల ధాన్యం మన కొనుగోలు కేంద్రాలకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా చెక్ పోస్టుల వద్ద వ్యవసాయ అధికారులు తప్పనిసరిగా విధుల్లో హాజరవ్వాలని ఆదేశించారు.తూకం చేసిన ధాన్యం సంచులను వెంటనే రైస్ మిల్లర్లకు తరలించే విధంగా ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గతంలో పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కేంద్రాల్లో ఏవైనా సమస్యలు ఉంటే ముందుగానే అదనపు కలెక్టర్లకు తెలియజేయాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియను లక్ష్యానుసారం సాఫీగా కొనసాగించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, కేంద్రాల నిర్వాహకులు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి స్వామి కుమార్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ విమల,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ అధికారులు,కేంద్రం నిర్వాహకులు,సంబంధిత అధికారులు,పాల్గొన్నారు.