జనం న్యూస్ ఏప్రిల్ 17(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం సేకరణకు సంబంధించిన పూర్తి వివరాలను రిజిష్టర్ లో నమోదు చేయాలని రైతుల నుంచి ధాన్యం సేకరించిన వెంటనే వారికి తప్పనిసరిగా రసీదులు అందించాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. బుధవారం మునగాల మండల పరిధిలోని బరాకత్ గూడెం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో తేమ శాతాన్ని పరిశీలించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ధాన్యం సేకరణలో జాప్యానికి తావు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రైతులు తెచ్చిన ధాన్యం నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్నట్లయితే, వెంటనే తూకం జరిపి, నిర్దేశిత రైస్ మిల్లులకు పంపడం జరుగుతోందని అన్నారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని రైతులకు సూచించారు. అకాల వర్షాలు ఉన్నందున ధాన్యం రాశులు తడవకుండా పట్టాలు కప్పుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట తహసిల్దార్ ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, శ్వేత, ఏ ఈ ఓ రేష్మి,పి ఎస్ ఎస్ సిఓ బసవయ్య సెంటర్ ఇంచార్జ్ సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.