విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.,
జనం న్యూస్ 18 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లా పోలీసుశాఖలో పని చేసి, ఇటీవల అనారోగ్య కారణాలతో మరణించిన ఎఆర్
కానిస్టేబులు కుటుంబానికి సహోద్యోగులు ఆర్థికంగా అండగా నిలిచి, ఇతర బ్యాచ్ పోలీసులకు ఆదర్శంగా నిలిచారని జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు ఏప్రిల్ 17న అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ - పోలీసుశాఖలో పని చేస్తూ ఇటీవల అనారోగ్య కారణాలతో సిహెచ్.గోపాలరావు అనే ఆర్మ్ డ్ రిజర్వు కానిస్టేబులు మరణించారన్నారు. ఈ కానిస్టేబులు
కుటుంబానికి ఆర్ధికంగా అండగా నిలవాలని భావించిన 2000సం. కు చెందిన ఎపిఎస్పీ మరియు ప్రస్తుతం ఎఆర్ కన్వర్షన్ గా బదిలీపై వచ్చి, ఎఆర్ లో విధులు నిర్వహిస్తున్న మిలీనియం బ్యాచ్ పోలీసు కానిస్టేబుళ్ళు స్వచ్ఛందంగా రూ.3.60 లక్షలను ప్రోగు చేసారన్నారు. అర్ధంతరంగా తమ కుటుంబ యజమానిని కోల్పోయి, ఆర్థికంగా నష్టపోయిన సమయంలో వారికి ప్రభుత్వం నుండి బెనిఫిట్స్ అందేంత వరకు వారి కుటుంబానికి ఆర్థికంగా ఆదుకొనేందుకు ఈ మొత్తం ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. ఈ తరహా చర్యలు చేపట్టడం వలన పోలీసు ఉద్యోగుల్లో ఐకమత్యం పెరగడంతోపాటు, వారి కుటుంబాలకు అండగా ఉన్నామన్న భరోసా లభిస్తుందన్నారు. చక్కని ఆలోచనతో నగదు ప్రోగు చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన 2000 మిలీనియం బ్యాచ్ ఎఆర్, ఎపిఎస్పీ పోలీసు కానిస్టేబుళ్ళును జిల్లా ఎస్పీ అభినందించారు.ప్రభుత్వం నుండి రావాల్సిన బెనిఫిట్స్, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం సకాలంలో కల్పించే విధంగా చర్యలు చేపడతామని, వెంటనే దరఖాస్తు చేయాలని, ఇతర దృవీకరణ పత్రాలను జిల్లా పోలీసు కార్యాలయానికి అందజేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. 2000సం.లో ఎపిఎస్పీ కానిస్టేబుళ్ళుగా ఎంపికై ఎపిఎస్పీలో పనిచేస్తున్న కానిస్టేబుళ్ళు రూ.2.50లక్షలు ప్రోగు చేయగా, ఆర్మ్డ్ రిజర్వుకు కన్వర్షనుగా వచ్చిన పోలీసు కానిస్టేబుళ్ళు రూ. 1.10 లక్షలను ప్రోగు చేసారన్నారు. ప్రోగు చేసిన రూ.3.60 లక్షల నగదును జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ చేతుల మీదుగా మరణించిన కానిస్టేబులు సిహెచ్.గోపాలరావు సతీమణి సిహెచ్.శారదకు జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేసారు.
ఈ కార్యక్రమంలో ఎఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, ఆర్ఐలు ఎన్.గోపాల నాయుడు, ఆర్.రమేష్
కుమార్, టి.శ్రీనివాస రావు, మిలినీయం బ్యాచ్ పోలీసు కానిస్టేబుళ్ళు ఎన్. వెంకటేశ్వరరావు, ఉమా మహేశ్వరరావు, టీ.పైడితల్లి, కృష్ణ మోహన్, శేషగిరి, రమేష్, మోహన్, రమేష్, హరి శంకర్, చిట్టిబాబు, సీతారాం, చక్రధర్, ప్రసాద్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.