జనం న్యూస్ ఏప్రిల్ 25(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
గ్రామీణ ప్రాంత విద్యార్థుల సహజ మేథో వికాసానికి సమ్మర్ క్యాంపులు దోహదం చేస్తాయని జన విజ్ఞాన వేదిక సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు గోళ్ళమూడి రమేష్ బాబు అన్నారు. గురువారం మునగాల మండల పరిధిలోని మాధవరం గ్రామంలో ఏర్పాటు చేసిన బాల విజ్ఞాన మేళా సమ్మర్ క్యాంపును జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు గోళ్ళమూడి రమేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ.. విద్యార్థులు సమ్మర్ క్యాంపులో పాల్గొని, తమ సృజనాత్మక ఆలోచనలు పెంపొందించుకొనుట ద్వారా వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ ఫోరం,సువెన్ మొబైల్ సైన్స్ ల్యాబ్ సంయుక్త నిర్వహణలో 10 రోజుల పాటు పూర్తి ఉచితంగా నిర్వహించే ఈ సమ్మర్ క్యాంపులో సరదా సైన్స్ ప్రయోగాలు, ఫన్ గేమ్స్, క్రియేటివ్ క్రాఫ్ట్స్ మేకింగ్, ఓరిగామి తదితర అంశాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు క్యాంప్ ఇన్చార్జి అంబటి సత్యనారాయణ తెలిపారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే కాకుండా ప్రైవేటు పాఠశాలలు,రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులు అందరూ ఈ సమ్మర్ క్యాంపు లో ఉచితంగా పాల్గొనవచ్చని తెలిపారు.సమ్మర్ క్యాంప్ ప్రారంభ వేడుకలలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ ఫోరం నేతృత్వంలో నిర్వహించిన ఫన్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మేడ్చల్ డీసీపీ నంద్యాల కోటిరెడ్డి, నిర్వాహకులను ఫోన్ ద్వారా అభినందించారు. సమ్మర్ క్యాంపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు మాధవ రెడ్డి,జన విజ్ఞాన వేదిక సూర్యాపేట జిల్లా సీనియర్ నాయకులు వల్లపట్ల దయానంద్,తల్లాడ రామచంద్రయ్య, మల్లికార్జున్,అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ రిసోర్స్ పర్సన్స్ వీరేష్, వెంకటేశ్వర్లు,స్వరూప, గురవయ్య మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.