జనం న్యూస్ 17 జనవరి
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు, శ్రమ శక్తి రాష్ట్ర అవార్డు గ్రహీత మొదిలి శ్రీనివాసరావు (65) కన్నుమూశారు. గురువారం ఉదయం ఆయన నిద్రలోనే విశాఖలోని తన గృహంలో హృద్రోగంతో మృతి చెందినట్లు కుమారుడు కౌశిక్ గుర్తించారు. వెంటనే శ్రీనివాసరావు భౌతికకాయాన్నివిజయనగరంలోని స్వగృహానికి తరలించారు. పెద్ద ఎత్తున కార్మికులు, అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు మొదిలి శ్రీనివాసరావు భౌతిక కాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. భార్య కమలావతి, ఇద్దరు కుమార్తెలు ఇందిరా సంయుక్త, నాగదుర్గ నివేదిత, కుమారుడు కౌశిక్ కలిగిన శ్రీనివాసరావు దివంగత మొదిలి సత్యం కుమారుడు, కార్మికనేత దివంగత మొదిలి సూర్యారావు సోదరుడు . తండ్రి, అన్నయ్య అడుగు జాడల్లో నడిచి కార్మిక వర్గానికి శ్రీనివాసరావు అత్యంత ఆప్తుడయ్యారు. అంతేగాక 1983 ఎన్నికలలో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా అశోక్ గజపతిరాజుపై పోటీ చేసిన చరిత్ర మొదిలి శ్రీనివాస రావుది. ఆయన భార్య , చిన్న కుమార్తె ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నందున వారు వచ్చాక ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలుస్తోంది. పలు ముఠా కార్మిక సంఘాలకు అధ్యక్షునిగా ఉన్న మొదిలి శ్రీనివాసరావు జిల్లా తెలగా సంక్షేమ సంఘం నిర్మాణంలోనూ, కార్యక్రమాలలోనూ విస్తృతంగా పాల్గొని తన సహాయ సహకారాలు అందించారు. గతంలో ఆంధ్రభూమి దినపత్రికలో పనిచేసిన ఆయన ఐఏన్ టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డికి ప్రధాన అనుచరునిగా గుర్తింపు పొందారు. మొదిలి శ్రీనివాసరావు మృతికి పాత్రికేయులు, తెలగ సంఘ నాయకులు ఎస్పీరాజు, దిమిలి అచ్యుతరావు తదితరులు తీవ్ర సంతాపం తెలిపారు. కార్మికలోకం ఒక మంచి నాయకున్ని కోల్పోయిందని అన్నారు.