జనంన్యూస్.ఏప్రిల్ 30. నిజామాబాదు. ప్రతినిధి.
జిల్లాలో నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. యాసంగి ధాన్యం సేకరణపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీ.ఎస్. చౌహాన్ తో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి గురించి కలెక్టర్ మంత్రి ఉత్తమ్ కుమార్ దృష్టికి తెచ్చారు. యాసంగిలో జిల్లాలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుని, కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికే 5.74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని తెలిపారు. ఇందులో 5.34 లక్షల మెట్రిక్ టన్నులు సన్న ధాన్యం సేకరణ జరిగిందని, దొడ్డు రకం ధాన్యం 40 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందని వివరించారు. మే చివరి వారం నాటికి లక్ష్యం మేరకు పూర్తిస్థాయిలో 8లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 700 పైచిలుకు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరుగుతోందని అన్నారు. ఇంకనూ లక్షన్నర మెట్రిక్ టన్నుల వరకు సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయని మంత్రుల దృష్టికి తెచ్చారు. ఇతర రాష్ట్రాల ధాన్యం జిల్లాకు రాకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశామని, ముఖ్యంగా జిల్లాకు ఆనుకుని ఉన్న మహారాష్ట్ర సరిహద్దులో మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచామని, గన్నీ బ్యాగులు వంటి వాటి కొరత లేదని అన్నారు. ప్యాడీ క్లీనర్లు, టార్పలిన్లు, తూకం యంత్రాలు సరిపడా ఉన్నాయని వివరించారు. ప్రతి కేంద్రంలోనూ సన్న ధాన్యం నిర్ధారణకు గ్రెయిన్ క్యాలీపర్లు వినియోగిస్తున్నారని తెలిపారు. సేకరించిన ధాన్యానికి సంబంధించి వెంటదివెంట రైతుల ఖాతాలలో బిల్లులు జమ చేస్తున్నామని, ఇప్పటివరకు రూ. 875 కోట్ల మేరకు బిల్లుల చెల్లింపులు జరిగాయని కలెక్టర్ వివరించారు. అయితే సన్నలకు సంబంధించిన బోనస్ డబ్బులు మంజూరు కావాల్సి ఉందని అన్నారు. రైస్ మిల్లుల వద్ద, కొనుగోలు కేంద్రాలలో ఎక్కడ కూడా ధాన్యం తూకంలో తరుగు పేరిట కోతలు అమలు చేయకుండా పక్కాగా పర్యవేక్షణ జరుపుతున్నామని అన్నారు. కొనుగోలు కేంద్రాల నుండి నిర్ధారిత రైస్ మిల్లులకు వెంటవెంటనే ధాన్యం తరలించేలా సరిపడా సంఖ్యలో లారీలను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఈసారి యాసంగిలో దేశంలోనే అత్యధికంగా రికార్డు స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం సాగు అయ్యిందని అన్నారు. 54.89 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా, 137.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయని వివరించారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 8329 కొనుగోలు కేంద్రాల ద్వారా 70.13 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ధాన్యం సేకరణకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఎక్కడ కూడా రైతులు ధాన్యం అమ్మకం విషయంలో ఇబ్బంది పడకుండా చూడాలని, ముఖ్యంగా లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా పోలీస్, రవాణా శాఖలతో సమన్వయాన్ని పెంపొందించుకుని ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అన్నారు. రైస్ మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు సకాలంలో అందించేలా చూడాలని, మిల్లుల సామర్ధ్యానికి అనుగుణంగా పూర్తిస్థాయిలో ధాన్యం నిల్వలను కేటాయించాలని సూచించారు. మిల్లర్లు ధాన్యం నిల్వ చేసుకునేందుకు వీలుగా గిడ్డంగులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అకాల వర్షాల వల్ల ధాన్యం నిల్వలు తడిసిపోకుండా వాతావరణ పరిస్థితుల గురించి క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది ముందస్తుగానే రైతులకు తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేసేలా చూడాలన్నారు. మరో రెండు, మూడు వారాల పాటు ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగనున్న దృష్ట్యా, ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా సాఫీగా కొనుగోళ్లు పూర్తయ్యేలా అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు. వీడియో కాన్ఫరెన్స్ లో డీఆర్డీఓ సాయాగౌడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్, డీఎస్ఓ అరవింద్ రెడ్డి, డీసీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.