విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్,
ఐపిఎస్ జనం న్యూస్ 23 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- స్టెఫెండరీ పోలీసు కానిస్టేబులు ఉద్యోగ నియామకాలకు పోలీసు పరేడ్ గ్రౌండులో జనవరి 21న చేపట్టిన పి.ఈ.టి. పరీక్షల్లో పాల్గొన్న అభ్యర్థి, అస్వస్థతకు గురై, అపస్మారక స్థితికి చేరుకొని, విశాఖపట్నం మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జనవరి 22న తెలిపారు. దత్తిరాజేరు మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన బౌడుపల్లి రవి కుమార్ (22 సం.లు) అనే వ్యక్తి జనవరి 21న పోలీసు పరేడ్ గ్రౌండులో నిర్వహించిన పి.ఈ.టి. పరీక్షలకు హాజరయ్యారన్నారు. పి.ఈ.టి. పరీక్షల్లో ప్రాధమిక అర్హత పరీక్ష అయిన 1600 మీటర్ల పరుగులో పాల్గొని, అస్వస్థతతకు గురై, అపస్మారక స్థితికి చేరుకున్నారన్నారు. వెంటనే, వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది స్పందించి, ప్రాధమిక చికిత్సను అందించారన్నారు. అదనపు ఎస్పీ పి.సౌమ్యలత అభ్యర్ధి ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకొని, మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో మహారాజా సర్వజన ఆసుపత్రికి తరలించి, వైద్యం అందించారన్నారు. అయినప్పటికీ, అభ్యర్థి ఆరోగ్యం మెరుగు కాకపోవడంతో అతని కుటుంబ సభ్యుల సమక్షంలో పట్టణంలోని తిరుమల మెడికవర్ ఆసుపత్రికి తరలించి, వైద్యం అందించారన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తిరుమల మెడికవర్ ఆసుపత్రిని సందర్శించి, చికిత్స పొందుతున్న బౌడుపల్లి రవి కుమార్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడి, వైద్యుల సూచనలతో విశాఖపట్నంలోని మెడికవర్ ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించామన్నారు. అంతేకాకుండా, వారి కుటుంబ సభ్యులకు అండగా ఉండి, సహాయ పడేందుకు వన్ టౌన్ ఎస్ఐ నరేష్ మరియు పోలీసు సిబ్బందిని కూడా పంపాలని వన్ టౌన్ సిఐను జిల్లా ఎస్పీ ఆదేశించారు. బౌడుపల్లి రవి కుమార్ (22 సం.లు) విశాఖపట్నంలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జనవరి 22న తెల్లవారు జామున 3గంటల సమయంలో మరణించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.