జనం న్యూస్ జూన్ 11 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో నూటికి నూరు శాతం ఫీజు రాయితీని కల్పించాలని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం (టియుడబ్ల్యూజే -ఐజేయు) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ కోరారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి తమ సంఘం పాటుపడుతుందని వివరించారు.ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం జర్నలిస్టులు నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పేద మధ్యతరగతి వర్గాల వారే ఎక్కువమంది జర్నలిస్టులు ఉన్నారని చెప్పారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో వారి పిల్లలకు ఫీజు రాయితీ కల్పించి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా అర్హులైన వారికి అందించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేటు విద్యాసంస్థల్లో నూటికి నూరు శాతం ఫీజు రాయితీని జర్నలిస్టుల పిల్లలకు కల్పించాలని కోరారు. జర్నలిస్టు పిల్లలకు నూటికి నూరు శాతం రాయితీని అందే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రకాష్ గౌడ్ , టియుడబ్ల్యూజే నాయకుడు నగరారే తారు తదితరులు పాల్గొన్నారు.