జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 23 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- లోకేశ్ 42వ జన్మదినం సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన మాజీమంత్రి ప్రత్తిపాటి. లోకేష్ ఫేస్ మాస్క్ లతో యువత నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో బుల్లెట్ నడిపి శ్రేణుల్ని ఉత్సాహపరిచిన పుల్లారావు. తెలుగువారి ఆరాధ్యదైవం స్వర్గీయ ఎన్టీఆర్ పౌరుషం, రాజకీయ చతురుత కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి గుణగణాలు పుణికిపుచ్చుకున్న యువనేత నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టామని, అలానే సర్వమత ప్రార్థనలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాలు చేశామని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో కూటమి పార్టీల నాయకులు, శ్రేణుల సమక్షంలో లోకేశ్ పుట్టిన రోజు కేక్ కట్ చేసిన అనంతరం పుల్లారావు మాట్లాడారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2024 ఎన్నికల్లో కూటమిపార్టీలు ప్రభంజనం సృష్టించాయని, 93శాతం సీట్లు సాధించడం వెనుక యువగళం పాదయాత్ర ప్రభావం ఎంతో ఉందని పుల్లారావు చెప్పారు. అరాచక ప్రభుత్వ దుర్మార్గాలను ప్రతిఘటిస్తూ, అన్నివర్గాల ప్రజల్ని యువగళం యాత్రతో లోకేశ్ ఏకం చేశారని మాజీమంత్రి స్పష్టంచేశారు. అలానే దేశంలో ఏ రాజకీయపార్టీకి లేని విధంగా టీడీపీ సభ్యత్వాలు కోటికి చేరడం వెనుక లోకేశ్ పాత్ర ఎంతో ఉందన్నారు. కోటి సభ్యత్వాలతో ఏ పార్టీకి లేని జనాదరణ టీడీపీకి సొంతమైందన్నారు. 2014లో పంచాయతీ రాజ్ శాఖా మంత్రిగా 25వేల కిలోమీటర్ల సీసీరోడ్ల నిర్మాణంతో గ్రామాల రూపురేఖలు మార్చిన లోకేశ్, తాజా ప్రభుత్వంలో IT, విద్యాశాఖమంత్రిగా తనదైన పనితీరు ప్రదర్శిస్తున్నారన్నారు.
దావోస్ వేదికగా ప్రపంచంలోని పెట్టుబడిదారులను ఆకర్షిస్తూ, రాష్ట్రాభివృద్ధి కోసం, యువత ఉపాధికోసం లోకేశ్ పనిచేయడం నిజంగా గర్వించాల్సిన విషయమన్నారు. గత పాలకుల అవినీతి, అరాచకాలతో రాష్ట్రం వైపు చూడటానికి సంకోచిస్తున్న పారిశ్రామికవేత్తల్లో కొత్తవిశ్వాసం, నమ్మకం కలిగించేందుకు లోకేశ్ ఎంతగానో కృషి చేస్తున్నాడని పుల్లారావు చెప్పారు. నాడు చంద్రబాబు IT రంగానికి పెద్దపీట వేస్తే, నేడు లోకేశ్ AI సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. చంద్రబాబు సలహాలు, సూచనలు పాటిస్తూ ఆయన అడుగుజాడల్లో తండ్రికి తగ్గ తనయుడుగా లోకేశ్ రాజకీయ ప్రస్థానం సాగుతోందన్నారు. లోకేశ్ జన్మదినం సందర్భంగా కూటమిపార్టీల శ్రేణులు నిర్వహించిన భారీ ద్విచక్రవాహన ర్యాలీలో మాజీమంత్రి స్వయంగా బుల్లెట్ నడిపి యువతను ఉత్సాహపరిచారు. ర్యాలీలో పాల్గొన్న యువత లోకేశ్ ఫేస్ మాస్క్ లు ధరించి జై తెలుగుదేశం… జై లోకేశ్.. జై చంద్రబాబు… జోహార్ ఎన్టీఆర్ నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు రాజా రమేష్, టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.