జనంన్యూస్. 21.నిజామాబాదు. ప్రతినిధి.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన ప్రగతి కనిపించేలా అధికారులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఇల్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేసేలా ప్రోత్సహించాలని అన్నారు. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేసుకుని, నిర్ణీత గడువు లోపు లక్ష్యానికి అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా నిరంతర పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ అధికారులను కార్యోన్ముఖులను చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఏ.ఈలు, పంచాయతీ కార్యదర్శులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై సమీక్ష జరిపారు. ఒక్కో మండలం వారీగా కేటాయించిన లక్ష్యం, లబ్ధిదారుల నిర్ధారణ, మంజూరీలు తెలిపిన వాటిలో ఎన్ని ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి, అవి ఏ దశలో ఉన్నాయి, క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ అధికారులను ఆరా తీశారు. లబ్ధిదారుల ఎంపిక, గ్రౌండింగ్ విషయంలో వెనుకంజలో ఉన్న మండలాలను గుర్తించి, లక్ష్య సాధన కోసం అంకిత భావంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో లబ్దిదారులను నేరుగా కలిసి, వారు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా ప్రోత్సహించాలని, మండల ప్రత్యేక అధికారులు, సూపర్వైజరీ ఆఫీసర్లు ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియను నిశిత పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలకు నిధుల సమస్య ఎంతమాత్రం లేదని, నిర్మాణాలు చేపడుతున్న లబ్దిదారులకు ఆయా దశలను బట్టి వెంటదివెంట వారి ఖాతాలలో నిధులు జమ చేయడం జరుగుతోందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆర్ధిక పరిస్థితి సహకరించని లబ్ధిదారులు ఉంటే, అవకాశం ఉన్న చోట మహిళా సంఘాల ద్వారా బ్యాంకు లింకేజీ కింద వారికి లక్ష రూపాయల వరకు రుణం ఇప్పించి, బేస్మెంట్ లెవెల్ వరకు నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసుకునేలా చూడాలన్నారు. పైలెట్ గ్రామాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ, మార్కింగ్ చేసిన ప్రతి ఇల్లు పునాది, గోడలు, రూఫ్ లెవెల్ దశలను దాటుకుని పూర్తి స్థాయిలో నిర్మాణాలు జరుపుకునేలా లబ్దిదారులకు తోడ్పాటును అందించాలని అన్నారు. ఎక్కడ కూడా ఇసుక కొరత తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణాలకు సరిపడా ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అటవీ సంబంధిత ఇబ్బందులను అధిగమించేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని, లబ్ధిదారులు సత్వరమే ఇళ్ల నిర్మాణాలు చేపట్టే విధంగా కృషి చేయాలని అధికారులకు హితవు పలికారు. ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై వాస్తవ పరిస్థితులతో కూడిన నివేదికలు సమర్పించాలని సూచించారు.కాగా, వన మహోత్సవం కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేలా ఆయా శాఖల వారీగా అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సన్నద్ధం అయి ఉండాలని కలెక్టర్ సూచించారు. మొక్కల పంపిణీకి నర్సరీలను సమాయత్తం చేయాలని, లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటేలా అనువైన ప్రదేశాలను గుర్తిస్తూ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆయా పథకాలు, కార్యక్రమాలు జిల్లాలో సమర్ధవంతంగా అమలయ్యేలా అంకిత భావంతో కృషి చేయాలని, సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా ప్రచ్ఛారా మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేయాలని కలెక్టర్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో డీఆర్డీఓ సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, హోసింగ్ శాఖ అధికారి నివర్తి, ఈ.డీఎం కార్తీక్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.