జనంన్యూస్.30. నిజామాబాద్.ప్రతినిధి.
డ్రాపౌట్ లు ఎక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి విద్యా శాఖ అధికారులకు సూచించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో అన్ని సర్కారు బడులలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగేలా చొరవ చూపాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో కలెక్టర్ సోమవారం మండల విద్యా శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. జూన్ 06 నుండి 12 వరకు నిర్వహించిన బడిబాట సందర్భంగా నూతనంగా నమోదైన ప్రవేశాల గురించి ఒక్కో మండలం వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల పాటు విద్యార్థులు ప్రవేశాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ప్రభుత్వ బడులలో మెరుగుపడిన మౌలిక సదుపాయాలు, ఉత్తీర్ణత, భర్తీ అయిన టీచర్ల ఖాళీలు, నాణ్యమైన విద్యా బోధన, ఉచితంగా యూనిఫామ్ లు, టెక్స్ట్ బుక్కులు, నోట్ బుక్కులు సమకూరుస్తున్న విషయాల గురించి ఇంటింటికి వెళ్లి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వివరిస్తూ పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పించేలా కృషి చేయాలన్నారు. కాగా, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం చేపట్టిన మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేయించాలని, ఈ పనులకు నిధులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. అవసరమైన బడులలో కిచెన్ షెడ్ లు వంటి వాటి నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపాలన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి కళాశాలల్లో చేరేలా పర్యవేక్షణ జరపాలని అన్నారు. పదవ తరగతి పూర్తి చేసుకుని పై చదువులలో చేరని వారిని గుర్తిస్తూ, ఒక్కో విద్యార్థి వారీగా పూర్తి వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఇప్పటికే అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో పంపిణీ జరిగాయని, నోట్ బుక్కులు కూడా 80 శాతం వరకు పంపిణీ అయ్యాయని మిగతా వాటిని కూడా జిల్లాకు కేటాయించిన వెంటనే విద్యార్థులకు ఆయా పాఠశాలల వారీగా అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఒక జత ఏకరూప దుస్తులు ఇప్పటికే విద్యార్థిని విద్యార్థులకు అందించామని, రెండవ జత యూనిఫామ్ లను మహిళా స్వయం సహాయక సంఘాలు త్వరగా కుట్టించి ఇచ్చేలా కృషి చేయాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఈఓ అశోక్, ఎంఈఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.