నారాయణ కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ ఆందోళన
జనం న్యూస్ 25 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- రాష్ట్రవ్యాప్తంగా నారాయణ , శ్రీ చైతన్య యాజమాన్యాలు విద్యార్థులను ఫీజుల దోపిడీ చేస్తూ వేధిస్తున్నాయని వాటి వలన అనేకమంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి రాము విమర్శించారు. నిన్న అనంతపురంలో నారాయణ కళాశాలలో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థి చరణ్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ స్థానిక నారాయణ జూనియర్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో విద్యాశాఖ నిబంధనలు నారాయణ , శ్రీ చైతన్య యాజమాన్యాలకు పట్టవా అని విమర్శించారు. మొన్నటికి మొన్న ఫీజు కట్టలేదని విజయవాడ గోసాల శ్రీ చైతన్య క్యాంపస్ లో విద్యార్థి మరియు అతని తండ్రిని అర్ధరాత్రి వరకు గేటు బయట పెట్టారని , నిన్నటికీ నిన్న అనంతపురంలో ఫీజు కట్టలేదని నెపంతో రోజంతా విద్యార్థినీ నుంచో బెట్టడంతో మనోవేదనకు గురై మూడో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. ఈ విధంగా రాష్ట్రంలో విద్యార్థులు కళాశాల యాజమాన్యాల దోపిడీకి బలవుతూ మరణిస్తుంటే అధికారులు తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి రాకముందు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారాయణ శ్రీ చైతన్య యాజమాన్యాల దోపిడీ గురించి చెప్తూ అధికారంలోకి రాంగానే వారిని కట్టడి చేస్తామని తెలిపారని, కానీ ఇప్పుడు విద్యార్థులు పిట్టల్ల రాలిపోతున్న తమ మంత్రి వర్గంలోనే ఉన్న నారాయణకు చెందిన కార్పొరేట్ కళాశాలలు కావడంతో నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అసలు ఉనికిలో ఉన్నారా లేరా అన్న విషయం అర్థం కావడం లేదని విమర్శించారు. విద్యార్థులు అందరూ తమ సొంత బిడ్డల్లా భావిస్తానని చెప్పిన నారా లోకేష్ ఇప్పుడు నారాయణ యాజమాన్యం విద్యార్థిని బలి తీసుకుంటే కనీసం స్పందన కూడా లేకపోవడం సిగ్గుచేయడానికి విమర్శించారు. తక్షణమే మరణించిన విద్యార్థి చరన్ కుటుంబానికి కోటి రూపాయల నష్ట పరిహారం ప్రకటించాలని అదేవిధంగా విద్యార్థిని వేధించిన నారాయణ కళాశాలను సీజ్ చేసి ఆ కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని ఎడల రాష్ట్రవ్యాప్తంగా నారాయణ కళాశాలలను ముట్టడిస్తామని ఈ ప్రతిఘటనకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం నిబంధనలకు విరుద్ధంగా ఐదు గంటల తర్వాత కూడా తరగతులు నిర్వహించడంతో నగరంలో ఉన్న నారాయణ కళాశాల నుండి విద్యార్థులను ఎస్ఎఫ్ఐ నాయకులు పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు J రవికుమార్ , K జగదీష్, P రమేష్,సహాయ కార్యదర్షులు సమీరా, కే రాజు, ఈ వంశీ నాయకులు గుణ, రాహుల్ ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు