జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 2 రిపోర్టర్ సలికినీడి నాగు
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వర్గ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9న జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని, ఇందులో భాగంగా మున్సిపల్ కార్మికులు సమ్మెలో పాల్గొననున్నారని ఏఐటీయూసీ అనుబంధ మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు, సీపీఐ నాయకులు చెప్పారు. ఈ మేరకు బుదవారం మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను అంబానీ, అదానీలకు దోచిపెట్టేందుకు కార్మికుల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. కార్మికుల హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఈ సమ్మెతో కనువిప్పు కలగాలని చెప్పారు. 44 కార్మిక చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్ లుగా మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. కార్పొరేట్ సంస్థలకు కార్మికులను కట్టు బానిసలుగా మార్చే కుట్రను ఖండించాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంలో నూతన మార్కెట్ విధానాన్ని, అన్ని పంటలకు గిట్టుబాటు ధర నిర్ణయించాలని, రుణాలు రద్దు చేయాలని, రైతులకు అన్ని వేదాల సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచాలని, రోజుకు రూ.800 కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో మున్సిపల్ కార్మికులు, వామపక్షాల కార్యకర్తలు క్రియాశీలకంగా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. సమావేశానికి సీపీఐ ఇన్చార్జి ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు, ఏవైవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ సుబాని, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి దాసరి వరహాలు, మ హిళా సమాఖ్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు వేల్పుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.