విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 03 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లాలో ఈ నెల 5న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే
విధంగా సంబంధిత పోలీసు అధికారులు, సిబ్బంది అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్ జూలై 2న ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ - ఈ నెల 5న జిల్లాలోని వివిధ న్యాయ స్థానాల్లో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారం (రాజీ) అయ్యే విధంగా సంబంధిత పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. పోలీసు స్టేషను పరిధిలో నమోదైన కేసుల్లో ఇరు వర్గాలు రాజీ అయ్యేందుకు అవకాశం ఉన్న కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు, చిన్న క్రిమినల్ కేసులు, ట్రాఫిక్ కేసులు, ఇతర కాంపౌండు కేసులను ముందుగా గుర్తించాలన్నారు. ఆయా కేసుల్లో ఇరు వర్గాలతో సంప్రదించి, సమావేశాలు నిర్వహించి, వారు రాజీ అయ్యే విధంగా మానవతా దృక్పదంతో వ్యవహరించాలన్నారు. ఇందుకుగాను పోలీసు స్టేషను స్ధాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ రోజూ లోక్ అదాలత్లో పరిష్కారమయ్యే కేసులను సంబంధిత అధికారులను పర్యవేక్షించాలని, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. కేసుల్లోని ఇరు వర్గాలపై ఒత్తిడి లేకుండా, సహకారాత్మక వాతావరణంలో రాజీ అయ్యేలా వారిని ప్రోత్సహించాలన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేస్తే కేసులు త్వరగా, సానుకూలంగా రాజీ అయ్యే అవకాశాలు పెరుగుతాయన్నారు. ఎక్కువ కేసులు లోక్ అదాలత్లో పరిష్కారమయ్యే విధంగా చర్యలు చేపట్టడం వలన న్యాయ వ్యవస్థపై భారం తగ్గి, బాధితులకు సత్వర న్యాయం లభిస్తుందన్నారు. అదే విధంగా నాన్ బెయిలబుల్ వారెంట్లను ఎగ్జిక్యూట్ చేయడంలో సంబంధిత పోలీసు అధికారులు చొరవ చూపాలన్నారు. వారంట్లను ఎగ్జిక్యూట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు నియమించి, వారంట్లు ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా చూడాలన్నారు. ఎగ్జిక్యూట్ అవ్వని నాన్ బెయిలబుల్ వారంట్లలో వారికి ష్యూరిటీగా నిలిచిన వ్యక్తులను ఆయా కోర్టులో హాజరుపర్చాలని, వారిపై తదుపరి చర్యలు న్యాయ స్థానాలు తీసుకొనే విధంగా సంబంధిత పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.