బీసీ డిక్లరేషన్‌ను ప్రభుత్వం అమలు చేయాలి.
ఈనెల 15న ఇందిరా పార్క్ వద్ద బీసీల మహా ధర్నా.
బీసీ ప్రజా ప్రతినిధుల ఫోరం రాష్ట్ర నాయకులు.
జనం న్యూస్ 10 జులై 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకార స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. గురువారం రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గడిల కుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య, ప్రధాన కార్యదర్శి ప్రణీత్ చందర్‌లు ఎల్కతుర్తిలో విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలోని బీసీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి బీసీపీఎఫ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ముందు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ప్రభుత్వము గద్దెనెక్కి కాలయాపన చేస్తుందన్నారు. పార్టీ తరుపున రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం బీసీలను మోసం చేయడమేనన్నారు. 42శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీ సామాజిక వర్గానికి మొత్తం జనాభా సర్వే నిర్వహించాలని, 33శాతం మహిళ రిజర్వేషన్లలో కూడా బీసీ మహిళలకు ఇవ్వాలని, మాట తప్పి జీవోల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే బీసీ వర్గాల ఆగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు. స్టేట్ కార్పోరేషన్ చైర్మన్లలో 42శాతం బీసీలకు
ఇవ్వాలన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అమలు చేయని పక్షంలో పార్టీలకు అతీతంగా బీసీ ప్రజాప్రతినిధులతో పాటు సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 15న ఇందిరాపార్క్ వద్ద వార్డు మెంబర్ మొదలుకొని ఎమ్మెల్యే, ఎంపీల వరకు బీసీ ప్రజాప్రతినిధులు, సంఘాలు, అన్ని పార్టీలతో కలిపి ఆందోళన నిర్వహిస్తామన్నారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే సకల జనుల సమ్మె తరహాలో ఉద్యమం చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం బీసీల మహా ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు సుప్ప ప్రకాశ్, వల్లూరి వీరేశ్, నవీన్ సాగర్, రాజేశ్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తంగెడ నగేశ్, సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్, నాయకులు మునిగడప శేషగిరి, చెవుల కొమురయ్య, స్థానిక సర్పంచ్ లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.