తక్షణమే డిగ్రీ విద్యార్థులకు ఆఫ్లైన్లో అడ్మిషన్స్ నిర్వహించాలి
పెండింగ్లో ఉన్న 6000 కోట్ల స్కాలర్షిప్ విడుదల చేయాలి
అధికారులు స్పందించకపోవడంతో కలెక్టరేట్ లోపలికి వెళ్లి ఆందోళన నిర్వహించిన విద్యార్థులు.
జనం న్యూస్ 18 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు వేలాదిగా కాంప్లెక్స్ నుండి ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకొని ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కే ప్రసన్నకుమార్ గారు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయి నాలుగు నెలలు కావస్తున్న ఇప్పటివరకు అడ్మిషన్లు నిర్వహించకపోవడం ప్రభుత్వం యొక్క చేతకాని తనానికి నిదర్శనమని విమర్శించారు. అడ్మిషన్లు నిర్వహించకపోవడంతో ఒకపక్క ప్రైవేట్ కళాశాలలో అక్రమంగా అడ్మిషన్లు చేస్తున్నాయని, ఇంకొన్ని రోజులు ప్రభుత్వం ఇదే పందా అవలంబిస్తే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరడానికి ఒక పిచ్చుక కూడా మిగలదని విమర్శించారు. తక్షణమే ఆఫ్లైన్ విధానంలో డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం డిగ్రీ విద్యార్థులకు దాదాపుగా 3600 కోట్ల రూపాయల పెండింగ్ పెట్టిందని, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్న మరో 3600 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిందని, దీనిపై ఎస్ఎఫ్ఐ దఫళ వారీగా పోరాటం చేస్తే ఇప్పటివరకు 1200 కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేశారని మరి మిగిలిన 6000 కోట్ల రూపాయల పెండింగ్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని విమర్శించారు. తక్షణమే పెండింగ్లో ఉన్న 6000 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ డిగ్రీ విద్యార్థులకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు పీజీ విద్య చదవాలంటే స్కాలర్షిప్ రాకుండా గత ప్రభుత్వం జీవో నెంబర్ 77 అనే నిరంకుశ జీవోను తీసుకొచ్చిందని , సంవత్సరం క్రితం పాదయాత్రలో ఇప్పటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ జీవోను రద్దు చేస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారని ఆ హామీని కృష్ణా నదిలో పడేశారా గోదావరి నదిలో పడేసార అని దుయ్యబట్టారు. తక్షణమే జీవో నెంబర్ 77 రద్దు చేయాలని పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మూడు డిమాండ్లు పరిష్కారం చేయాలని లేనియెడల ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు కలెక్టరేట్లు ముట్టడించారని త్వరలో ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించాల్సి ఉంటుందని దీనికి రాష్ట్ర విద్యా యంత్రాంగం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆందోళనకు మద్దతు తెలిపిన యుటిఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు కోరెడ్ల విజయ గౌరీ గారు మాట్లాడుతూ న్యాయబద్ధమైన విద్యార్థుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని పదవుల పంపకం మీద దృష్టి పెట్టే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను రోడ్డుపాలు చేస్తున్న ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, లేనియెడల పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మూడు గంటల పాటు కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించిన అధికారులలో ఎటువంటి స్పందన లేకపోవడంతో విద్యార్థులు శాంతియుతంగా కలెక్టరేట్ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు ఈ సందర్భంలో అక్కడ ఉన్న బందోబస్తు పోలీసులు విద్యార్థులపై భౌతిక దాడికి దిగుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో విద్యార్థులు కలెక్టరేట్ లోపల ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి రాము, సిహెచ్ వెంకటేషులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిర్వహిస్తున్న ఆందోళన పై కూటమి ప్రభుత్వం ఇటువంటి దాడులు నిర్వహించడం సిగ్గుచేటని , సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి తప్ప సమస్యల ప్రశ్నించే గొంతుకును ఆపేయడం సమంజసం కాదని విమర్శించారు. పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయని పోలీసులు అత్యుత్సాహంతో విద్యార్థుల బట్టలు కూడా చినిగిపోయాయని తెలిపారు. ఇటువంటి దుందుడుకు స్వభావాన్ని పోలీసులు ఆపాలని విమర్శించారు. అనంతరం ఆందోళన వద్దకు ఇంచార్జ్ డిఆర్ఓ గారు వచ్చి వినతి పత్రం తీసుకున్నారు. న్యాయబద్ధమైన ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. డిఆర్ఓ గారి హామీతో ఎస్ఎఫ్ఐ బృందం మరియు విద్యార్థులు ఆందోళన విరమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వి చిన్నబాబు, జె రవికుమార్ ,ఎస్ సమీరా ,ఎం వెంకీ , పి రమేష్ , సహాయ కార్యదర్శులు శిరీష, రాజు ,వంశీ తదితరులు పాల్గొన్నారు.